1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (21:19 IST)

ఏపీ సీఎం జగన్ సీరియస్‌: సచివాలయానికి ఎందుకు రావట్లేదు..

సచివాలయానికి ఐఏఎస్‌ అధికారులు రాకపోవటంపై ఏపీ సీఎం జగన్ సీరియస్‌ అయ్యారు. ఈ వ్యవహారంపై తక్షణం దృష్టిపెట్టాల్సందిగా సీఎస్‌ ఆదిత్యనాథ్‌ను సీఎం ఆదేశించారు. ఇక నుంచి తాను కూడా పదిరోజులకోమారు సచివాలయానికి వస్తానని సీఎం చెప్పారు. ఉద్యోగులు, అధికారుల్లో విధుల పట్ల నిర్లక్ష్యం పనికిరాదని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. సీఎం ఆదేశాల మేరకు సచివాలయంలో అధికారులతో సీఎస్ భేటీ అయ్యారు. 
 
అధికారులు సచివాలయానికి రాకుండా.. విభాగాధిపతులు, క్యాంపు కార్యాలయాల నుంచి పనిచేయటం సరికాదని సీఎస్ పేర్కొన్నారు. పాలన గాడితప్పేందుకు అవకాశం ఇవ్వకూడదని సీఎస్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని విద్యావిధానంలో సమూల మార్పులకు నాంది పలికినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా.. ఇంగ్లీష్ మీడియం, కార్పొరేట్ తరహా క్లాసు రూములతో విద్యార్ధులకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు తెలిపింది. 
 
నూతన విద్యా సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో రూ.731.30 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యాకానుక రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 16న ఉదయం 11 గం.లకు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో స్వయంగా పాల్గొని ప్రారంభించనున్నారు. 
 
విద్యారంగంపై ఇప్పటి వరకు రూ.29,114.37 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం వెల్లడించింది. విద్యాసంవత్సరం విద్యార్థులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో 'జగనన్న విద్యాకానుక' పథకం ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను కిట్ల రూపంలో అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.