అర్థరాత్రి జీవోలు - ఏసీబీ తనిఖీలు ఆపండి : బొప్పరాజు
ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా నడుచుకోవద్దని హితవు పలికారు. ముఖ్యంగా, అర్థరాత్రి జీవోలు ఆపాలంటూ డిమాండ్ చేశారు. తహసీల్దారు కార్యాలయాల్లో గతేడాది జనవరి నుంచి పలు దఫాలుగా చేపడుతున్న తనిఖీలను తక్షణం నిలిపివేయాలని కోరారు.
విశాఖ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సాధారణ పరిపాలనను ఎప్పటికప్పుడు సమీక్షించి లోటుపాట్లు సవరించడానికి ఐదు అంచెల వ్యవస్థ ఉందన్నారు.
వాటిని కాదని ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడం వల్ల మానసిక స్థైర్యం దెబ్బతింటోందని ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. లంచం తీసుకుంటూ దొరికిన, అధిక ఆదాయం, ఆస్తుల కేసుల్లో పట్టుబడిన ఉద్యోగుల విషయంలో అసోసియేషన్ జోక్యం చేసుకోదని బొప్పరాజు స్పష్టం చేశారు.