బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 5 అక్టోబరు 2021 (11:47 IST)

కాకినాడ మేయర్‌, డిప్యూటీ మేయర్‌లపై నేడు అవిశ్వాసం

గత ఇరవై రోజులుగా వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయ మలుపులు తిరిగిన కాకినాడ మేయర్‌ మార్పు ఘట్టానికి తెరపడనుంది. కాకినాడ నగర మేయర్‌ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మాన సమావేశం  నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం డిప్యూటీ మేయర్‌ కాలా సత్తిబాబుపై అవిశ్వాస తీర్మాన సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీ అధ్యక్షత వహించనున్నారు.

నాలుగేళ్ల పదవీకాలం పూర్తయిన అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను మార్చేందుకు గత ప్రభుత్వంలో చట్టం చేయడంతో ఈ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మెజారిటీ కార్పొరేటర్లు గెలుపొందారు. దీంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు టీడీపీకి దక్కాయి. తదనంతరం అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో కాకినాడలో రాజకీయ సమీకరణలు మారాయి.
 
మెజారిటీ టీడీపీ కార్పొరేటర్లు వైసీపీ అనుకూల కార్పొరేటర్లుగా మారారు. వైసీపీ కండువా కప్పుకోకపోయినా ఆ పార్టీ సమావేశాల్లో సైతం హాజరవుతున్నారు. 2017లో జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో 50 డివిజన్లకుగాను 48 డివిజన్లకు ఎన్నికలు జరుగగా, 32 టీడీపీ, 10 వైసీపీ, 3 బీజేపీ, 3 ఇండిపెండెంట్లు గె లుపొందారు. అప్పట్లో ఇండిపెండెంట్‌లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మేయర్‌ వ్యవహారశైలి నచ్చక కొందరు టీడీపీ కార్పొరేటర్లు విభేదించారు. ఈ పరిణామాలు తారస్థాయికి చేరి మొత్తం టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌కు దూరమయ్యారు. రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికల సమయంలో 21 మంది టీడీ పీ కార్పొరేటర్లు తమను ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లుగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. 
 
ఇదిలా ఉండగా టీడీపీలో గెలిచి ఆ పార్టీ ఓటమి పాలైన వెంటనే అధికార పార్టీతో చేతులు కలిపిన ఘటనలే మేయర్‌ను ఒంటరిని చేశాయనే కోణంలో చర్చ సాగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు కార్పొరేటర్లను తీసుకుని సిటీ ఎమ్మెల్యేను కలవడం అప్పట్లో దుమారం రేపింది. నాలుగేళ్లు పూర్తయిన తర్వాత పదవి నుంచి దించేస్తారనే ప్రచారం రెండేళ్ల కిందట నుంచే విస్తృతంగా ప్రచారం సాగింది. దీంతో పదవి కాపాడుకోవడం కోసం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి.

కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మేయర్‌పై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లంతా ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి వర్గంగా ఏర్పడడం తో మేయర్‌ మార్పుపై గురిపెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ద్వారంపూడి ఆధ్వర్యంలోని టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్‌ను కోరడంతో ఇది జరుగుతోంది.