శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

పథకాలు మా నాన్నవి... కలరింగ్ కొత్తది : హరికృష్ణ ఎద్దేవా

ప్రస్తుతం నడుస్తున్న ప్రజాకర్షక సంక్షేమ పథకాలన్నీ దివంగత మహానేత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినవేనని ఆయన కుమారుడు హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని

ప్రస్తుతం నడుస్తున్న ప్రజాకర్షక సంక్షేమ పథకాలన్నీ దివంగత మహానేత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినవేనని ఆయన కుమారుడు హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి, తన తండ్రికి నివాళులు అర్పించారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుత ప్రభుత్వాలు పాత పథకాలకు కొత్త కలరింగ్ ఇచ్చి, వాటిని తమ పథకాలుగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరువలేరని అన్నారు. ఆయన దూరమై ఇన్ని సంవత్సరాలు అయినా, ప్రజల మనసులో సుస్థిరంగా ఉన్నారని హరికృష్ణ చెప్పారు.
 
అలాగే, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చచ్చిపోయిందని, ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ ఉన్నా లేనట్టేనని ఆరోపించారు. ఆదివారం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి తన భర్తకు నివాళులు అర్పించిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ సార్థకతను కోల్పోయిందని, ఇప్పుడా పార్టీకి తెలంగాణలో మనుగడే లేదని అన్నారు. 
 
పేద ప్రజల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేసిన లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ బతికున్నంతకాలం, ప్రతి మహానాడులో కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. 1982లో కిలో బియ్యం రూ. 2 పథకాన్ని తెచ్చారని, బీసీలు, మైనారిటీలకు రాజ్యాధికారాన్ని దగ్గర చేశారని చెప్పారు.