ఓఎల్ఎక్స్‌లో మీరు ఏదైనా వస్తువును అమ్మకానికి పెట్టారా..?
ఓఎల్ఎక్స్‌లో మీరు ఏదైనా వస్తువును అమ్మకానికి పెట్టారా..? అయితే జాగ్రత్త పడండి. మీరూ ఇలాంటి మోసంలో చిక్కుకోవచ్చు. తన బైక్ విక్రయించేందుకు ఓఎల్ఎక్స్‌లో పోస్ట్ చేసిన వ్యక్తిని ఓ బాలుడు దారుణంగా మోసం చేశాడు. ట్రైల్ వేస్తానంటూ బైక్‌తో ఉడాయించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ములకలచెరువుకు చెందిన ఓ వ్యక్తి తన బైక్ ను ఓఎల్ఎక్స్ యాప్‌లో అమ్మకానికి పెట్టాడు.
దీనిని చూసిన ఓ బాలుడు తాను కొనుగోలు చేస్తానంటూ ఫోన్ చేశాడు. బైక్ వేసుకొని కదిరికి రమ్మన్నాడు.. కదిరి వచ్చిన తర్వాత బైక్‌ను ట్రయల్ వేసి చూస్తానని.. ఆ తర్వాత డబ్బులిస్తానని నమ్మబలికాడు. దీంతో ఆ బాలుడ్ని నమ్మిన వ్యక్తి బైక్ తాళాలిచ్చాడు. బైక్‌తో వెళ్లిన బాలుడు ఎంతకీ తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఏం చేయాలో తోచక మిన్నకుండిపోయాడు.
ఐతే బైక్‌తో పరారైన బాలుడు.. వేగంగా వెళ్తుండగా.. ఓ చోట పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పోలీసులను చూసి భయపడిన బాలుడు.. దారిమళ్లించి వేగంగా వెళ్లడంతో అనుమానించిన పోలీసులు అతడ్ని పట్టుకొని విచారించగా అసలు విషయం చెప్పాడు. దీంతో బాలుడ్ని జువైనల్ హోమ్‌కు తరలించి.. వాహన యజనమానికి సమాచారమిచ్చారు. బాలుడు ఇదే తరహాలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడ్ని మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు.
ఓఎల్ఎక్స్ లో దొంగతనం చేసిన బైకులు, ఇతర వస్తువులను విక్రయిస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ ఓఎల్ఎక్స్ ఆధారంగా దొంగతనాలకు పాల్పడటం మాత్రం ఇదే మొదటిసారని పోలీసులు చెప్తున్నారు. అందుకే గుర్తుతెలియని వ్యక్తులకు వాహనాలు ఇవ్వొద్దని.. ఒకవేళ ఇచ్చినా వారిదగ్గర నుంచి ఐడీ ప్రూఫ్స్ లాంటివి తీసుకున్న తర్వాతే వాహనాలు ఇవ్వాలంటున్నారు.