శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (11:20 IST)

అమ్మాయిల బైక్‌ స్టంట్‌.. రూ.28 వేల అపరాధం

సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల మదిని కొల్లగొట్టేందుకు పలువురు వినూత్నరీతిలో సాహసభరితమైన విన్యాసాలు చేస్తుంటారు. కొన్నిసార్లు అలాంటివి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. మరికొన్ని సార్లు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతుంటాయి. 
 
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఇద్దరు యువతుల విషయంలోనూ అలానే జరిగింది. వారు బైక్‌పై చేసిన స్టంట్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ కావడంతో భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే శివంగి దబాస్‌ గత శనివారం తన స్నేహితురాలు, రెజ్లర్‌ స్నేహ రఘువన్షితో కలిసి ఓ బైక్ విన్యాసాన్ని చేసింది. ఇందుకు సంబంధించిన వీడియాను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. 
 
ఈ వీడియోలో రెజ్లర్ స్నేహ భుజాలపై శివంగి కూర్చొని ఉండగా ఆమె బైక్ నడుపుతోంది. ఇక్కడివరకు అంత బాగానే ఉన్నా.. ఆ విన్యాసం వీడియో వైరల్‌గా మారి ఘజియాబాద్‌లో ట్రాఫిక్‌ అధికారుల వరకూ చేరింది. 
 
ఇంకేముంది ట్రాఫిక్‌ నియమనిబంధనల్ని అతిక్రమించారంటూ రెజ్లర్‌ స్నేహ తల్లి మంజుదేవి ఇంటికి రూ.11 వేలు చలానా పంపించారు. వారికి బైక్‌ ఇచ్చిన ద్విచక్రవాహన యజమాని సంజయ్‌ కుమార్‌కు సైతం రూ.17 వేలు జరిమానా విధించినట్లు ఘజియాబాద్ ట్రాఫిక్‌ ఎస్పీ రామానంద్‌ కుశ్వాహ తెలిపారు. సరదా కోసం చేసిన ఈ వీడియో జరిమానా వరకు వెళ్తుందని అసలు ఊహించలేదని శివంగి వాపోయారు.