మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తాగి డ్రైవ్ చేస్తున్నారా? మద్యంబాబులతో పాటు ప్రయాణించేవారికీ పదేళ్ళ జైలు!

ఇటీవలి కాలంలో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు, వాటివల్ల జరిగే ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ.. ఈ తరహా ప్రమాద కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. 
 
ఈ క్రమంలో మద్యం సేవించి వాహనాలు నడిపే మందుబాబులతోపాటు వారి వెంట వాహనంలో ఉన్నవారు కూడా ఇకనుంచి ఊచలు లెక్కపెట్టాల్సిందే. మోటారు వాహనాల చట్టం 1988 సెక్షన్‌-188 ప్రకారం తాగి వాహనం నడిపే వ్యక్తితోపాటు ఆ వాహనంలో ఉన్నవారిపై కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదుచేయనున్నారు. 
 
ఈ విషయం చట్టంలో మొదటి నుంచి ఉన్నప్పటికీ ఇంతకాలం తాగి వాహనం నడిపిన వారిపైనే కేసులు నమోదుచేసేవారు. తాజాగా రోడ్డుప్రమాద నివారణకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై కఠన చర్యలకు ఉపక్రమించిన పోలీసులు, వాహనంలోని అందరిపై కేసులు నమోదుచేస్తున్నారు. దీనిపై వాహనదారులకు అవగాహన కల్పించడానికి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 
 
వాహన డ్రైవర్‌ మద్యం సేవించాడని తెలిసి కూడా ఆ వాహనంలో ప్రయాణిస్తూ ఏదైనా ప్రమాదానికి కారణమైతే.. అందులోని ప్రయాణికులంతా అందుకు బాధ్యులవుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనంలోని అందరిపై కేసులు నమోదుచేస్తామని హెచ్చరిస్తున్నారు. 
 
మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తున్నవారితో ప్రయాణిస్తూ ఎవరి మరణానికైనా కారణమైతే చట్టంలోని 304 పార్ట్‌ 2 కింద వాహనంలోని అందరికి పదేళ్ళపాటు జైలు శిక్ష పడే ప్రమాదముంది. ఇప్పటికే చోటుచేసుకొన్న ఈ తరహా ప్రమాదాలపై పోలీసులు 304 పార్ట్‌ 2 కింద కేసులు నమోదుచేశారు.