సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (19:32 IST)

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం.. ఏపీలోనూ ఉధృతి.. ఐదుగురు మృతి

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఎల్బీనగర్‌లోని చిత్ర లే అవుట్‌లో ఉంటున్న అనాథ విద్యార్థి గృహంలో 45మంది విద్యార్థులకు కరోనా సోకింది. హాస్టల్‌లో మొత్తం 100 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో మిగిలిన వారికి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటీవ్ వచ్చిన వారిని గ్రౌండ్ ప్లోర్‌లో ఉన్న ఐసోలేషన్ రూమ్‌లో ఉంచనున్నారు. నెగటివ్ వచ్చిన విద్యార్థులను ఫస్ట్ ప్లోర్‌కు తరలించనున్నారు.
 
అలాగే బంజారాహిల్స్ పోలీసులను కరోనా వెంటాడుతోంది. సెకెండ్‌ వేవ్‌లో 11 మంది పోలీసులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బంజారాహిల్స్‌ సీఐ కళింగరావు, మరో ఎస్సై కరోనా బారిన పడ్డారు. రోజురోజుకు పోలీస్‌స్టేషన్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో పోలీసు సిబ్బంది భయాందోళనలో ఉన్నారు. ఫస్ట్ ఫేజ్‌లో బంజారాహిల్స్ పీఎస్‌లో 50 మంది పోలీసులకు కరోనా సోకింది. 
 
ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో కొత్తగా 13 వందల 26 మంది కరోనా బారినపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. మరో ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
 
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 282 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 271, విశాఖలో 222 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే నెల్లూరులో 171, కృష్ణా జిల్లాలో 138, ప్రకాశంలో 54 మంది కరోనా బారినపడ్డారు. ఇక కరోనా నుంచి 911 మంది పూర్తిగా కోలుకోగా.... ప్రస్తుతం ఏపీలో 10 వేల 710 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 7 వేల 244 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9 లక్షల 9వేల 2కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.