శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 30 నవంబరు 2017 (18:20 IST)

అమ్మాయిలు వద్దు... అనుకున్నవారు ఆ ఊయలలో వేస్తే చాలు...

అమరావతి : ఆడపిల్ల రక్షణ కోసం ప్రభుత్వం త్వరలో ఊయల పథకం ప్రవేశపెట్టనుందని ప్రభుత్వ విప్ యామిని బాల చెప్పారు. శాసనసభ ప్రాంగణం మీడియా పాయింట్ వద్ద గురువారం మధ్యాహ్నం ఆమె మాట్లాడారు. ఆడపిల్లలు పుడితే కొందరు రోడ్ల ప్రక్కన, మురుగు కాలువలలో పడవేయడం లేదా వడ్

అమరావతి : ఆడపిల్ల రక్షణ కోసం ప్రభుత్వం త్వరలో ఊయల పథకం ప్రవేశపెట్టనుందని ప్రభుత్వ విప్ యామిని బాల చెప్పారు. శాసనసభ ప్రాంగణం మీడియా పాయింట్ వద్ద గురువారం మధ్యాహ్నం ఆమె మాట్లాడారు. ఆడపిల్లలు పుడితే కొందరు రోడ్ల ప్రక్కన, మురుగు కాలువలలో పడవేయడం లేదా వడ్ల గింజ వేసి చంపేయడం వంటివి చేస్తున్నారని, ఇకముందు అలా కాకుండా అమ్మాయిలు వద్దు అనుకొన్నవాళ్ళు ఆ పిల్లలను  ప్రభుత్వం ఏర్పాటు చేసే ఊయలలో వేస్తే, ఆ పిల్లల పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, అదే ఊయల పథకం అని ఆమె వివరించారు. 
 
అలా ఊయలలో ఉంచిన పిల్లలను ఎవరైనా పిల్లలు లేనివారు పెంచుకోవడానికి ముందుకు వస్తే వారికి ఇచ్చే ఆలోచన కూడా ఉందని తెలిపారు. ఈ రోజు శాసనసభలో మహిళాసాధికారితపై చర్చ జరిగినట్లు చెప్పారు. మహిళా పార్లమెంట్, మహిళా సాధికారితపై పది అంశాలతో విడుదల చేసిన అమరావతి ప్రకటన, పోటీ తత్వం, అసహనం, ఒత్తిడి తదితర అంశాలపై సభ్యులు చక్కగా మాట్లాడినట్లు తెలిపారు. మహిళల ముందడుగుతోనే కుటుంబానికి మేలు జరుగుతుందన్నారు. మహిళలు మంచి ఆలోచనతో వుంటే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
 
సమాజంలో మానవ సంబంధాలు కొరవడుతున్న కారణంగా నేటి మహిళ అనేక సమస్యలు ఎదుర్కొంటుందన్నారు. మహిళా గొంతు వినిపించే అవకాశం కల్పించిన స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మహిళా విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందని ఎన్టీఆర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారని, అలాగే మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత కూడా ఆయనదేనన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు, ఉన్నత స్థానం కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వజ్ర సంకల్పంతో పని చేస్తున్నారని కొనియాడారు. 
 
ఉన్నత విద్య, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా మహిళలు ఎదుగుదలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. రాజకీయంలో మహిళలు అధికంగా ఉన్నారంటే ఆ ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. పొదుపు అనేది ఓ మ్యాజిక్ అని, దాని ద్వారా మహిళలు ఎదగడానికి డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారని, నేడు ఈ గ్రూపుల్లో 70 లక్షల మంది మహిళలు ఉన్నారని వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి నిలదొక్కుకోవలసిన అవసరం ఉందన్నారు. మహిళా కమిషన్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నారని యామిని బాల చెప్పారు.