సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 జులై 2023 (13:08 IST)

వైకాపా అధినేత జగన్‌కు షాకిచ్చిన విశాఖ నేత - పార్టీకి గుడ్‌బై

panchekarla - jagan
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా నేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేత ఒకరు తేరుకోలేని షాకిచ్చారు. ఈయన విశాఖపట్టణం జిల్లా వైకాపా అధ్యక్షుడుగా ఉన్నారు. పేరు పంచకర్ల రమేష్ బాబు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. వైజాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన రాజీనామా విషయాన్ని ఆయన బహిర్గతం చేశారు. 
 
పెందుర్తి నియోజకవర్గంలో గత కొంతకాలంగా వైకాపా నేతల మధ్య వర్గ పోరు నడుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి అసెంబ్లీ టిక్కెట్ కోసం ఎమ్మెల్యే అదీప్ రాజ్, పంచకర్ల రమేష్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అదేసమయంలో పెందుర్తిలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై పంచకర్ల పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. 
 
దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన పార్టీ అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత యేడాది కాలంగా అనేక సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినప్పటికీ అందుకు వీలు కాకుండా పోయిందన్నారు. కింది స్థాయిలో సమస్యలు తీర్చలేనపుడు పదవిలో ఉండి లాభమేంటని ప్రశ్నించారు. ఫెయిల్యూర్ లీడర్‌గా ఉండేందుకు తాను సిద్ధంగా లేనని అందుకే రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.