మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (06:46 IST)

పరిషత్‌ ఎన్నికల ఫలితాలు బోగస్‌: అచ్చెన్నాయుడు

పరిషత్‌ ఎన్నికల ఫలితాలు బోగస్‌ అని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైసిపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. అందువల్లే తమ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించిందని తెలిపారు. ఈ మేరకు  ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు.

వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అడుగడుగునా చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ ధిక్కరణ జరుగుతోందని విమర్శించారు. వైసిపి నేతలు, కార్యకర్తలు టిడిపి అభ్యర్థులపై దాడులు, దౌర్జన్యాలకు దిగారని, కనీసం నామనేషన్లు కూడా వేయనీకుండా అడ్డుకున్నారని, పోలీసుల సాయంతో బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు.

అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అన్ని విధాలా సహకరించి ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయంగా పరిగణించరాదని, అలా భావిస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ము ముఖ్యమంత్రి జగన్‌కు ఉందా అని అచ్చెన్న ప్రశ్నించారు.

ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ భవిష్యత్‌ కోల్పోవాల్సి వస్తుందని జగన్‌ హెచ్చరించడంతోనే మంత్రులు, శాసనసభ్యులు గ్రామాలపై దండయాత్ర చేశారని విమర్శించారు.
 
ఈ ఎన్నికలను తాము బహరిష్కరిస్తే ఎక్కువ స్థానాలు గెలిచామంటూ మంత్రులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాడులు, దౌర్జన్యాలతో ప్రజల్ని భయప్రబాంతులకు గురిచేసి ఈ ఎన్నికల్లో వైసిపి గెలిచిందన్నారు.

మాచర్లలో బండా ఉమా, బుద్ధా వెంకన్నపై దాడి చేశారని ఆయన గుర్తు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల అరాచాకలపై సిఎం దృష్టి పెట్టలేరా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసిపికి 25 సీట్లు కూడా రావని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోతామని వైసిపి అరాచకాలకు పాల్పడిందని విమర్శించారు.