శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (08:54 IST)

స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా: అచ్చెన్నాయుడు

స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, ఆ వ్యాఖ్యలను ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని టిడిపి ఎంఎల్‌ఏ కింజరపు అచ్చెన్నాయుడు ప్రివిలేజ్‌ కమిటీకి తెలిపారు.

శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ సమావేశపు హాలులో మంగళవారం కమిటీ విచారణ నిర్వహించింది.

కమిటీ ముందు హాజరైన అచ్చెన్నాయుడు స్పీకర్‌పై ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, వాటిని ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. ఆ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తునట్లు తెలిపారు.

అనంతరం ఇదే అంశంపై ప్రివిలైజ్‌ కమిటీ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రెస్‌నోట్‌లో స్పీకర్‌ను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారని, ఆ నోట్‌ తనకు తెలియకుండానే ఇచ్చారని చెప్పారని అన్నారు. మీకు తెలియకుండా ప్రెస్‌నోట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు.

దీనికి ఆయన ఆయన క్షమాపణ ధోరణిలోనే వివరణ ఇచ్చారని, మళ్లీ ఈ అంశాన్ని పొడిగించదలుచుకోలేదన్నారు. అచ్చెన్నాయుడు వివరణపై సభ్యుల అభిప్రాయాలు తీసుకుని తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కి స్పీడ్‌పోస్ట్‌ ద్వారా నోటీస్‌ పంపామని, ఆయన ప్రివిలైజ్‌ కమిటీ పరిధిలోకి ఏ విధంగా వస్తారో స్పష్టంగా వివరించామన్నారు. నిమ్మల రామానాయుడుకు కూడా నోటీసులు పంపామన్నారు.

కూన రవికుమార్‌ అందుబాటులో ఉన్నారా లేదా అనేది విచారిస్తామన్నారు. మిగిలిన అన్ని విషయాలపై ఈనెల 21న ప్రివిలైజ్‌ కమిటీ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.