శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 29 జులై 2020 (15:32 IST)

కౌలు రైతుల రుణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ: బ్యాంకర్లను కోరిన జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ 211వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ నీలం సాహ్ని, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్‌ సీజీఎం సుధీర్‌కుమార్‌.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా యూనియన్‌ బ్యాంక్‌ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దినేశ్‌కుమార్‌ గార్డ్, ఆర్బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ సుబ్రతాదాస్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. '2020–21 సంవత్సరంలో రుణాల లక్ష్యం 2,51,600 కోట్లు. ఇది గత ఏడాదితో పోలిస్తే 9.78 శాతం అధికం. వ్యవసాయరంగానికి రూ.1,28,660 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.9శాతం అధికం. 2019–20 రుణప్రణాళికలో 99.42 శాతం లక్ష్యాన్ని చేరుకుంది.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈలు)కు రూ.39,600 కోట్ల రుణాలు ఇవ్వాలని భావిస్తున్నాం. గత ఏడాదితో పోలిస్తే 10 శాతం అధికం. విద్యా రుణాల కింద రూ.1,900 కోట్లు, ఇళ్ల రుణాల కింద రూ.9,710 కోట్లు, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కింద రూ.410 కోట్లు ఇవ్వాలని లక్ష్యం. పునరుత్పాదక ఇంధన (రెన్యువబుల్‌ ఎనర్జీ) రంగానికికి రూ.454 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.

వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణకు రూ.3,400 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొత్తం మీద ప్రాధాన్యతా రంగానికి రూ.1,87,550 కోట్లు ఇవ్వాలని భావిస్తుండగా.. ఇది గత ఏడాదితో పోలిస్తే 10.88 శాతం అధికం. ప్రాధాన్యేతర రంగానికి రూ.64,050 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యం. గత ఏడాదితో పోలిస్తే ఇది 6.75 శాతం అధికం' అని  పేర్కొన్నారు. 
 
సమావేశంలోని మఖ్యంశాలు..
►రైతులకు సున్నా వడ్డీ సకాలంలోనే ఇవ్వాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఖరీఫ్‌ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బును రబీ నాటికి చెల్లిస్తామని, రబీ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బును ఖరీఫ్‌ నాటికి చెల్లిస్తామని, దీనికి సంబంధిచిన వివరాలు సకాలంలో ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కోరారు.
►అలాగే గ్రామాల్లో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్‌ తదితర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దీని కోసం తగిన సహాయం అందించాలని కోరారు. 
►ప్రతి ఆర్బీకేలో ఈ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రతి మండలానికీ కోల్డ్‌ స్టోరేజీ, కోల్డ్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 
►ఆర్బీకేల ద్వారా రైతు ఉత్పత్తుల సమాచారాన్ని సెంట్రల్‌ సర్వర్‌కు అనుసంధానం చేసి వారి మార్కెటింగ్‌కు సహకారం అందిస్తామని సీఎం చెప్పారు. 
► రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకూ తగిన సహకారం అందించాలని ఆర్థికశాఖ అధికారులు బ్యాంకర్లను కోరారు. గోదావరిలో వరద జలాలను వినియోగించుకోవడానికి బృహత్‌ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, దీనికి తగిన విధంగా తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. 
► కౌలు రైతుల రుణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని బ్యాంకర్లను కోరారు.