గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 జులై 2020 (14:21 IST)

జగన్ రాజప్రాసాదం వీడి జనంలోకి రావాలి: దేవినేని

కరోనావ్యాప్తిలో రాబోయే 5, 6 రోజుల్లోనే రాష్ట్రం ఢిల్లీని దాటిపోతుందని, నిన్న ఒక్కరోజే 7,620 కేసులు, 56 మరణాలు నమోదయ్యాయని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియడంలేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  ప్రధాని చెబుతున్న మాటలు ముఖ్యమంత్రికి వినబడుతున్నట్లుగా లేవన్న ఉమా,  ప్రజలు మాస్కు ధరించేలా వారిలో అవగాహాన కల్పించడం కూడా ఈ ప్రభుత్వం చేతగావడం లేదన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి వైద్యులు, నర్సులు, పారిశుధ్య, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులు పడుతున్న తపన ముఖ్యమంత్రి ఎందుకు గ్రహించడం లేదన్నారు.

వేగంగా వైరస్ వ్యాపిస్తున్నా, ముఖ్యమంత్రి కరోనాను ప్రధాన అజెండాగా ఎందుకు తీసుకోవడం లేదన్నారు. ఆయన చేస్తున్న సమీక్షలు తాడేపల్లి రాజప్రాసాదం గడప దాటడం లేదన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లోని ఆహారం అధ్వాన్నంగా ఉన్నా, పట్టించుకోవడం లేదన్నారు.

లక్ష కేసుల్లో 50వేల యాక్టివ్ కేసులుంటే, అందుకు తగిన విధంగా ఆసుపత్రుల్లో పడకలు, వెంటిలేటర్లు ఉన్నాయో లేదో, ముఖ్యమంత్రి, మంత్రులు ఒక్కరోజైనా సమీక్ష చేశారా అని దేవినేని ప్రశ్నించారు. ఎంతమంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు...  ఎంతమంది రోగులకు వైద్యం అందుతోందనే వివరాలు ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని ముఖ్యమంత్రి పరిశీలిస్తే, ఆయనకు వాస్తవాలు బోధపడతాయన్నారు.

అనంతపురంలో ట్రైనీ కలెక్టర్ వెళ్లేవరకు ఆసుపత్రిలో నుంచి మృతదేహం బయటకు రాలేదని, గుంటూరు ఆసుపత్రిలో 30మృతదేహాలున్నా వాటిని బంధువులకు అప్పగించలేదన్నారు. డాక్టర్ సుధాకర్ మాస్కులు, పీపీఈకిట్లు అడిగినప్పుడే ప్రభుత్వం స్పందించి ఉంటే, నిన్న తెనాలిలో పారామెడికల్ సిబ్బంది రోడ్డెక్కాల్సిన దుస్థితివచ్చేది కాదన్నారు.

ప్రశ్నించిన వారిని వేధించడం, సస్పెండ్ చేయడం తప్ప, ప్రభుత్వం పరిపాలనా విధానంలో మార్పు రావడం లేదన్నారు. ప్రజలకు మానసిక ధైర్యం కల్పించేందుకు బాధ్యతగల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేస్తున్నపనిని, ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోతు న్నాడో చెప్పాలన్నారు. జగన్ మీడియా ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నాడన్నారు.

కేంద్రం నుంచి వచ్చిన రూ.8వేల కోట్లు, ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1000కోట్లు దేనికి ఖర్చు చేశారో  సమాధానంచెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. సమీక్షలు ఎందుకు చేస్తున్నారో, ముఖ్యమంత్రికైనా తెలుసా అని ఆయన ఎద్దేవాచేశారు. గుంటూరు జిల్లాలో రెవెన్యూ, పోలీస్, వైద్యఆరోగ్యశాఖలోని అధికారులు ప్రజల కోసం పనిచేసి ప్రాణాలమీదకు తెచ్చుకున్నా ముఖ్యమంత్రి వారిని పట్టించుకో లేదన్నారు.

వైసీపీ నేతలు ప్రచారార్భాటంతో నేషనల్ పర్మిట్ లారీల్లా విచ్చలవిడిగా తిరిగి రాష్ట్రంలో కరోనా వ్యాపింపచేసి, పక్కరాష్ట్రాల్లో చికిత్స పొందుతున్నారని దేవినేని ఎద్దేవాచేశారు.  వైసీపీ నేతలు పొందుతున్న కార్పొరేట్ వైద్యమే రాష్ట్రంలోని ప్రతిపేదవాడికి అందించాలన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పడు నీతిఅయోగ్ కు పంపిస్తుంటే, ముఖ్యమంత్రి కనీసం మీడియా ముందుకు కూడా రావడంలేదన్నారు.

లాక్ డౌన్ సమయంలో మద్యం షాపులు మూసేసిన ప్రభుత్వం, జేట్యాక్స్ కోసం రాత్రి 9 గంటలవరకు విక్రయాలు జరపడం దుర్మార్గం కాదా అని ఉమా మండిపడ్డారు. నాసిరకం మద్యంతో ప్రజలు ప్రాణాలుకోల్పోతున్నా, వైసీపీనేతలు పందికొక్కుల్లా పక్కరాష్ట్రాల నుంచి కల్తీ మద్యం తెచ్చి విక్రయాలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. మైలవరం నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయన్నారు.

మద్యం దుకాణాలు తెరవడం వల్లే గ్రామాల్లో కరోనా వ్యాప్తి అధికమైందన్నారు. వైసీపీనేతలకు ఇసుక, మద్యం, భూముల అమ్మకంపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదన్నారు.  తన రాజప్రాసాదం దాటి బయటకు రాకుంటే, ప్రజల కష్టాలు ముఖ్యమంత్రికెలా తెలుస్తాయన్నారు. గుంటూరు ఆసుపత్రిలో 30 మృతదేహాలు పడిఉన్నా, వాటిని బంధువులకు అప్పగించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు.

రౌతుని బట్టి గుర్రం నడుస్తుందని, ముఖ్యమంత్రిని బట్టే అధికారులు కూడా పనిచేస్తా రన్నారు.  కరోనా బాధితుల వెతలు, ఆర్తనాదాలు ముఖ్యమంత్రికి ఎందుకు వినపడటం లేదన్నారు. అమరావతి రైతులకు వ్యతిరేకంగా, రాజధాని తరలింపుకోసం ఏ లాయర్లను పెట్టాలి.. ఆగస్ట్ 15నాటికి విశాఖకు ఎలా తరలి వెళ్లాలన్నా దానిపై పెట్టిన శ్రద్ధ, ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యంపై పెట్టడం లేదన్నారు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా అని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో తనని కాదని చంద్రబాబుని గెలిపించారని అక్కసుతో ఉన్న జగన్  ప్రజలపై కక్ష పెంచుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు. అచ్చెన్నా యుడు, కొల్లు రవీంద్రకు బెయిల్ రాకుండా చేయాలన్న దానిపై ఉన్న శ్రద్ధ కరోనా నివారణపై లేకపోవడం విచారకరమన్నారు. 

రేషన్ డీలర్లకు కమీషన్ ఇవ్వకుండా 30వేల కుటుంబాలను జగన్ ప్రభుత్వం అభద్రతా భావంలోకి నెట్టిందన్నారు. కరోనా బారిన పడి చనిపోయినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, మరణించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు రూ.50లక్షలు, ఉపాధి కోల్పోయి పనులులేక ఇబ్బందులు పడే పేదల కుటుంబాలకు రూ.5నుంచి10వేలు సాయం చేయమంటే, ఎందుకు పెడచెవిన పెడుతున్నారని దేవినేని నిలదీశారు.

వాలంటీర్, సచివాలయ వ్యవస్థద్వారా రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్ వ్యవస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. పార్టీ నాయకుడు, వాలంటీర్, ఎమ్యెల్యేల చుట్టూ తిరిగినా రైతుకు సకాలంలో ఒక్క విత్తనం ప్యాకెట్ కూడా అందడం లేదన్నారు. విత్తనాల సరఫరాకు  కోట్లరూపాయలు ఖర్చుచేసిన ప్రభుత్వం, రైతులకు మాత్రం న్యాయం చేయలేకపోతోందన్నారు.

నేను చేసిందే పరిపాలన అన్నట్లుగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాడని, ఆయన అహంకారధోరణి ప్రజలకు శాపంగా మారిందన్నారు.  ధాన్యం రైతులకు చెల్లించాల్సిన రూ.240కోట్లను ఈ ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదని,  పసుపు కొనుగోళ్లు జరగడం లేదని, సుబాబుల్ ని రూ.1400కు కూడా కొనేవారు లేకుండా పోయారన్నారు. 

సున్నావడ్డీ సహా, అనేక కార్యక్రమాలతోప్రభుత్వం రైతులను నిలువునా మోసగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలు అర్థం చేసుకొని ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలన్నారు. ఆక్సిజన్ అందక, వెంటిలేటర్లు లేక ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు.