1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 జులై 2020 (14:58 IST)

ఆగస్టు 15న 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు: జగన్

రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కోర్టుల ద్వారా అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారని, చివరకు దీని కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.

కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన, ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. రాష్ట్రమంతా 30 లక్షల పేద కుటుంబాలకు ఆరోజున ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం చేరువలోని గాజులపేటలోని వైయస్సార్‌ జగనన్న కాలనీల మొక్కలు నాటిన సీఎం వైయస్‌ జగన్, 71వ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘జగనన్న పచ్చతోరణం’ గా చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్రమంతా ఈ ఏడాది 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఆనందం కలిగిస్తోంది
గాజులపేటలో 33 ఎకరాల లేఅవుట్‌ చేసి, 1600 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఇక్కడ ఎకరా కనీసం రూ.3 కోట్లు ఉంటుందన్న ఆయన, చదరపు గజం విలువ రూ.5 వేలు అని తెలిపారు. 

అంత మంది పేదలకు ఇళ్ల స్థలం ఇవ్వడ, వారు తమ ఇంటి స్థలం వద్ద చక్కగా చెట్లు నాటడం చూస్తే ఆనందం వేస్తోందని చెప్పారు.
 
ఆగస్టు 15న:
‘ఏ రకంగా టీడీపీ వాళ్లు కేసులు వేస్తున్నారో మీ అందరికీ తెలుసు. చివరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని కూడా అడ్డుకుంటున్నారు. దాన్ని నివారించడం కోసం ప్రభుత్వం చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తోంది.

పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వకుండా అడ్డుుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్ధితుల్లో ఈ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అవసరం లేదు. అయితే దేవుడి దయతో ఆగస్టు 15న రాష్ట్రమంతా 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వగలుగుతామని అనుకుంటున్నాం.

రాష్ట్రమంతా 1.48 కోట్ల ఇళ్లు ఉంటే, ఇప్పుడు 30 లక్షల కుటుంబాలకు ఇంటి స్థలం ఇస్తున్నాం అంటే దాదాపు 20 శాతం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
 
90 రోజుల్లో ఇస్తాం:
అర్హులెవరైనా మిగిలిపోతే, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. రాష్ట్రమంతా దాదాపు 13 వేల గ్రామ పంచాయితీలు ఉంటే, 17 వేల లేఅవుట్లు చేసి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని సీఎం వివరించారు. ఆ తర్వాత మొక్కలు నాటడంపై అందరితో ప్రమాణం చేయించారు.
 
ప్రతిజ్ఞ:
‘ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతకి సోపాన మార్గమని గుర్తెరిగి, ప్రకృతిలోని సమతుల పరిస్థితి అవసరాన్ని గుర్తిస్తూ, ప్రతి నీటి బొట్టును సద్వినియోగ పరుస్తానని, చెట్ల అవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ, వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడ వాడ ఇంటా బయటా అన్ని చోట్లా మొక్కలు నాటడంతో పాటు, వాటి సంరక్షణ బాధ్యత కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’. 
 
ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పలువురు  ఎమ్మెల్యేలు హాజరయ్యారు.