శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

వచ్చే సీజన్‌ కల్లా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు: జగన్‌

రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష జరిపారు. క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో పాటు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 
ఆ పరిస్థితి రాకూడదు:
పంటలకు తగిన మార్కెటింగ్‌ లేక, కనీస గిట్టుబాటు ధరలు రాక ఏటా అరటి, చీనీ, టమోటా, ఉల్లి, నిమ్మ, పసుపు, మిర్చి తదితర పంటలు పండించే రైతులు ఆందోళన చెందుతున్నారని సమావేశంలో సీఎం  వైయస్‌ జగన్‌ ప్రస్తావించారు.

పంటలు అమ్ముకునేందుకు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదన్న ఆయన, ఆయా పంటల విషయంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలని ఆదేశించారు. పంటల అమ్మకాల కోసం రైతులు రోడ్కెక్కే పరిస్థితి రావొద్దని, మళ్లీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించకూడదని పేర్కొన్నారు.
 
శాశ్వత పరిష్కారం కావాలి:
రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే.. ఏ పంట, ఎంత వరకు కొనుగోలు చేయాలి?. ఎంత మేర ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు తరలించాలన్న దానిపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. ఈ సీజన్‌ నుంచి మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా అధికారులు తగిన జాగ్రత్త పడాలన్న ఆయన, దీని కోసం ఖర్చు ఎంత అయినా పర్వా లేదు కానీ, సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని స్పష్టం చేశారు.
 
ప్రభుత్వం ఆదుకుంటుంది:
రైతుల పండించే పంటలకు గిట్టుబాటు ధరలు రావడంతో పాటు, వాటి మార్కెటింగ్‌లో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తెలిపారు.

అందుకు అవసరమైతే ధరల స్థిరీకరణ నిధి ఉపయోగిస్తుందన్న ఆయన, ఈ ఏడాది దాదాపు రూ.3 వేల కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. రైతుల కష్టాలను తీర్చడానికి వ్యవస్థీకృతంగా సిద్ధం కావాలన్న ముఖ్యమంత్రి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌తో పాటు, మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌పైనా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
 
ఆ పంటలను గుర్తించండి:
వచ్చే సీజన్‌ కల్లా రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాట్లు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ముఖ్యంగా మార్కెటింగ్‌ లేక, గిట్టుబాటు ధరలు రాక రైతులకు ప్రధానంగా ఇబ్బందులు తెస్తున్న 7 – 8 పంటలను గుర్తించి, వాటి ప్రాసెసింగ్‌తో పాటు, వాల్యూ ఎడిషన్‌ ఏం చేయగలమో ఆలోచించాలని అధికారులకు నిర్దేశించారు. 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ప్రఖ్యాత కంపెనీలతో టై అప్‌ (ఒప్పందం) చేసుకోవాలన్న ముఖ్యమంత్రి, తమ పంటలు అమ్ముడు పోవడం లేదని వచ్చే 9 నెలల కాలంలో రైతులు ఎవ్వరూ రోడ్డెక్కే పరిస్థితులు రాకూడదని మరోసారి స్పష్టం చేశారు.
 వీటన్నింటికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారన్న దానిపై నెల రోజుల్లో నివేదిక సిద్ధం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు.
 
మరో నివేదిక:
అదే విధంగా రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) స్థాయి నుంచి ఎక్కడెక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేయగలం? ఎప్పటిలోగా వాటిని ఏర్పాటు చేయగలం? వ్యయం ఎంత? అన్న వాటిపై కూడా మరో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాథమిక (ఆర్‌బీకే) స్థాయిలో ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆ తర్వాత మండలం, నియోజకవర్గం స్థాయిల్లో తదుపరి ప్రాసెసింగ్‌కు సంబంధించి అంచనాలు తయారు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.