శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 ఆగస్టు 2021 (10:20 IST)

ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం: పవన్ కల్యాణ్

జనసేన పార్టీ చేపట్టే కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సూచించారు.

పార్టీ ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్య పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఆ మూడు జిల్లాల్లో ఉన్న సమస్యలు, ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులు, విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, పర్యావరణ సంబంధిత సమస్యలు చర్చకు వచ్చాయి.

ఉత్తరాంధ్రలో ప్రజాపోరాట యాత్ర చేపట్టినప్పుడు వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ దృష్టికి తెచ్చారని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం వల్ల నిర్వాసితులైనవారికి,  భూములు ఇచ్చినవారికి ఇప్పటికీ సెటిల్మెంట్ కాక పరిహారం విషయంలో న్యాయం జరగలేదని.. ఈ అంశంలో పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలపై తగిన ప్రణాళిక రూపొందించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

అదే విధంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో గత కొన్నేళ్లుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను గుర్తించి వారిని పార్టీ సంబంధించిన వివిధ కమిటీల్లో బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీని మరింతగా పటిష్టం పరచడానికి సమాలోచనలు జరిపారు.

ఈ నెల 7వ తేదీన ఉత్తరాంధ్ర ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను క్రోడికరించాలని దిశానిర్దేశం చేశారు.  ప్రజలకు సేవ చేస్తూ, అన్ని విషయాల్లో అండగా ఉండే విధంగా పార్టీ కమిటీల నియామకం జరగాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తెలియజేశారు.