వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ గుర్తుపై కీలక తీర్పు
గత కొంత కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై నెలకున్న ఉత్కంఠకు ఎట్టకేలకు నేడు తెరపడింది. ఈ గుర్తుపై ఢిల్లీ హైకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో నడుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. దీంతో తమ పార్టీపై గత కొంతకాలంగా పన్నిన కుట్రలన్నీ కోర్టు తీర్పులో కొట్టుకు పోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు వివరాలను ఒకసారి తెలుసుకుందాం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని, సీఎం జగన్ నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్) పేరును వాడకుండా చూడాలని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌పై పలు దఫాలు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది.
వైసీపీని రద్దు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పేరు ఇతరులు వాడకుండా చూడాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లెటర్ హెడ్ ,పోస్టర్లు , బ్యానర్లలో ఉపయోగించే పేరుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముందుగా ఎన్నికల సంఘం వైఎస్సార్ అనే పేరును తమకు కేటాయించిందని, దానిని ఇతరులు వినియోగించడానికి వీల్లేదని పిటిషన్ తరపు వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే వైఎస్సార్ పేరుపై తమకు హక్కు ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయవాది తమ వాదనలు గట్టిగా వినిపించారు. అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఈ రోజు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ మేరకు తీర్పునిచ్చింది.
తప్పుడు ఉద్దేశాలతో కేసు వేశారని పేర్కొంటూ అన్న వైఎస్సార్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అన్నవైఎస్సార్ పిటిషన్‌కు ఎలాంటి మెరిట్ లేదన్న న్యాయస్థానం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కొనసాగుతుందని స్పష్టం చేయడంతో ఆ పార్టీ ఊపిరి పీల్చుకుంది.