విశాఖ ఉక్కుపై ప్రధానిని కలుస్తా : పవన్ కళ్యాణ్
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయనున్నట్టు వచ్చిన వార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి తెరలేపాయి. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్క ఫ్యాక్టరీ యాజమాన్య హక్కులను పూర్తిగా వదులుకోవడానికి కేంద్రం సిద్ధపడటం పట్ల రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదే అంశంపై జనసేనాని పనవ్ కల్యాణ్ కూడా స్పందించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తామన్నారు. విశాఖ ఉక్కు ఏపీ ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పుకొచ్చారు. 22 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ కర్మాగారం 17 వేల మంది పర్మినెంటు ఉద్యోగులకు, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు, లక్షమంది వరకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తోందని తెలిపారు.
ఇంతటి గొప్ప ప్లాంటు ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడం జనసేన అభీష్టానికి వ్యతిరేకం అని పేర్కొన్నారు. నాడు ఈ కర్మాగారం కోసం లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారని, 32 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు.
త్యాగాల ఫలితంగా సాకారమైన ఉక్కు కర్మాగారం చేతులు మారుతోందంటే తెలుగువారికి ఆమోదయోగ్యం కాదని పవన్ స్పష్టం చేశారు. కేంద్రం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అసలు, పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగే ప్రభుత్వమేనని ఆరోపించారు. ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ఈ కర్మాగారం కూడా పెట్టుబడుల ఉపసంహరణ పరిధిలోకి వెళ్లిందని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని, కర్మాగారాన్ని కాపాడుకుంటామని పవన్ ప్రకటించారు.