ఆ ఒక్క నిర్మాత వద్ద మాత్రమే ప్రాధేయపడ్డాను : పవన్ కళ్యాణ్
తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర నిర్మాతల్లో ఏఎం రత్నం ఒకరు. ఈయన ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. అలాగే, తమిళ చిత్ర పరిశ్రమను పరిధిని పెంచిన నిర్మాతల్లో ఆయన ఒకరు. అలాంటి నిర్మాత పుట్టిన రోజు నేడు. దీంతో ఆయనకు అనేక మంది సినీ సెలెబ్రిటీల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాంటివారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఈ సందర్భంగా ఆయనకు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏఎం రత్నంతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు.
'నాతో సినిమా చేయమని ఇప్పటివరకు ఏ ఒక్క నిర్మాతను అడగలేదు. ఒక్క రత్నంని మాత్రమే అడిగాను. ఆయనతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. రత్నంగారి బంధువు ఒకరు నాకు నెల్లూరులో సన్నిహిత మిత్రుడు. ఆ పరిచయంతో రత్నంగారిని చెన్నైలో కలుస్తుండేవాణ్ణి.
ముఖ్యంగా తన సినీ కెరీర్‌లో 'ఖుషీ' సినిమాను నిర్మించి నాకు మరచిపోలేని హిట్ ఇచ్చారు. సినిమాలో కళాత్మకత ఎక్కడా తగ్గకుండానే వాణిజ్య అంశాలను, ఆధునిక సాంకేతికత మేళవించి మన సినిమాల మార్కెట్ పరిధి పెంచారు. ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాన' అని పవన్ అన్నారు. ప్రస్తుతం ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో పవన్ ఓ భారీ సినిమా చేస్తున్నారు. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.