శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మే 2021 (12:38 IST)

ప్రభుత్వ నిర్లక్ష్యమే కోవిడ్ రోగుల ప్రాణాలు తీస్తోంది.. పవన్ కళ్యాణ్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యమే కోవిడ్ రోగుల ప్రాణాలు హరిస్తోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సోమవారం రాత్రి తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఊపిరి అందించే వాయువుని సక్రమంగా అందించని దుస్థితి నెలకొనడం వల్లే అత్యంత విషాదకరమైన ఈ ఘటన చోటుచేసుకొందన్నారు. రాయలసీమ ప్రజల వైద్య అవసరాలకు కేంద్రమైన రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా, వైద్యపరమైన మౌలిక వసతులు సరిగా లేవని రోగులు ఎంతో ఆవేదన చెందుతున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అందరూ చెబుతున్నారు. కర్నూలు, హిందూపురంల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ రోగులు ఆక్సిజన్ సరఫరా అందక చనిపోయారు. అయినప్పటికీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోలేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఇలాంటి విపత్కర సమయంలో విమర్శలు చేయకూడదని సంయమనం పాటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా తక్షణమే పరిస్థితులను చక్కదిద్దాలని జగన్ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి విషాదకర ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు.