బాంబులు వేసినా చలించనంత బలం... జనసేన అధినేత పవన్ కళ్యాణ్
సిద్ధాంత బలం లేకుండా కేవలం నాయకుల బలం మీద ఆధారపడి నడిచే పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాధించలేవనీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలే అందుకు ఉదాహరణ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. జనసేన పార్టీ మాత్రం చాలా బలమైన సిద్ధాంతాలు ఉన్న పార్టీ అని తెలిపారు. జిల్లా స్థాయి సమీక్షా సమావేశాల్లో భాగంగా కర్నూలు జిల్లాకి చెందిన నాయకులు, కార్యకర్తలకి విడివిడిగా దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. "2019 ఎన్నికలు జనసేనకు మొదటి పోరాటమే. ఇదే ఆఖరి పోరాటం కాదు. రాజకీయాల్లో ఓ స్థాయికి రావాలంటే కనీసం ఓ దశాబ్దం ఓపిక ఉండాలి. కొత్త నాయకత్వం రావాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే కొత్తవారు ఎంత వరకు నిలబడతారు అన్నదే అసలు సమస్య. దెబ్బ కొడితే అంతకు మించి బలమైన పోరాటం చేసే శక్తి ఉన్నవారు కావాలి. అలాంటి వారిని గుర్తించాలంటే, తయారు చేయాలంటే సమయం కావాలి. కర్నూలు జిల్లాతో నాకున్న అనుబంధం ఈనాటిది కాదు.
అయితే హత్తిబెళగళ్ పేలుళ్లు జరిగినప్పుడు బాధితుల్ని పరామర్శించేందుకు బయలుదేరినప్పుడు కర్నూలు వస్తున్నారు.. జనం రారని చెప్పారు. కానీ రోడ్లు పట్టనంత జనం వచ్చినప్పుడు సగటు కుటుంబాలు ఏ స్థాయిలో మార్పు కోరుకుంటున్నాయో అర్ధం అయ్యింది. 2009లో ఎక్కువ శాతం సీనియర్ లీడర్లే వచ్చారు. కొత్త వారిలో కసి ఉంటుంది కానీ సరైన వ్యూహం ఉండదు. ప్రవహించే నదిలోనూ పవర్ ఉంటుంది. దాన్ని వెలికి తీయాలంటే టర్బైన్లకి అనుసంధానం చేయాలి, ఓ ప్రక్రియ జరపాలి. ఓ క్రమ పద్ధతిలో వెలికి తీయాలి. వ్యవస్థని మార్చేయాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చిన వారిని కూడా ఓ క్రమ పద్ధతిలో అనుసంధానం చేసి వారిలో ఉన్న కసిని వెలికితీయాలి.
అది సమాజానికి ఉపయోగపడేలా తయారు చేయాలి. 2001 నుంచే ప్రజలు మార్పు కోరుకోవడాన్ని గమనించా. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మీద విసుగుతో జనం మన వైపు చూస్తున్నారు. మనం ఏదో చేస్తామన్న ఆశతో మన కోసం వస్తున్నారు. వచ్చే జనాన్ని శక్తిగా మలచుకోవాలి. 2014లో అతికొద్ది మందితో పార్టీ ప్రారంభించాక, ఇంత మంది అభిమానం చూరగొనడానికి రాజకీయాలపై ఉన్న వ్యతిరేకతే కారణం. పాలకులు అందుబాటులో ఉన్న వనరుల్ని అందరికీ ఆమోదయోగ్యమయ్యే రీతిలో పంచితే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. అందరికీ సమానమైన రీతిలో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే జనసేన లక్ష్యం.
నాయకులకి కోట్ల రూపాయలు దోచేయడంలో ఉన్న తెలివితేటలు, శ్రద్ధ యువతకి ఉపాధి కల్పించడంలో ఉండవు. స్థానిక పరిస్థితులు అర్ధం చేసుకోకుండా రాజకీయాలు చేయలేం. కులాల కాన్సెప్ట్‌తో అసలు నడపలేం. నా బలం, బలహీనత రెండూ నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. అందుకే నేను ఎలాంటి పరిస్థితులకి అయినా తట్టుకుని చాలా బలంగా నిలబడగలను. 2003 నుంచి రాజకీయాల కోసం పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యా. కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు మెజారిటీ శాతం కొత్తవారే ఉండాలన్న లక్ష్యంతోనే 60 శాతం సీట్లు ఇస్తానని చెప్పా.
సంక్రాంతి పండగ లోపు స్వల్పకాలిక కమిటీలు వేసి బాధ్యతలు అప్పగిస్తాం. అవసరం అనుకుంటే మధ్యలో మార్పుచేర్పులు చేద్దాం. యువతకి రాజకీయంగా ఎదగాలన్న కసి ఉన్నా పొలిటికల్ శక్తులు ఎదగనివ్వవు. కర్నూలు లాంటి జిల్లాల్లో అయితే ప్రజలు కుటుంబాల మధ్య నలిగిపోతున్నారు. రాజకీయాల్లో రెండు రకాల శక్తులు ఉంటాయి. ఒకటి పాలసీ మేకింగ్ అయితే, రెండోది మాస్ ఫాలోయింగ్. జనసేనకి అన్నీ రెండు రకాల బలం ఉన్నవారు కావాలి. కొత్త పార్టీ అంటే అంతా కొత్త నాయకులే ఉన్నా నిలబడలేం. అనుభవం, మన సిద్ధాంతాలకి దగ్గరగా ఉన్న సీనియర్ల అవసరం కూడా ఉంది. 175 స్థానాల్లో పోటీపై నాకు స్పష్టత ఉంది. ఎన్ని స్థానాల్లో కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలి అన్న అంశం మీదా స్పష్టత ఉంది.
అన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధమయ్యా. అన్ని స్థానాల్లో గొప్పవారిని నిలబెట్టాలన్న కాంక్ష నాకూ ఉంది. గొప్ప అంటే ఆస్తిలో కాదు. గొప్ప ఆశయాలు ఉన్నవారిని. స్థానికంగా కూడా నాలా ఆలోచించే నాయకుల్ని తయారుచేయాలి. అందుకు కొంత సమయం పడుతుంది. లాంగ్‌టర్మ్ విజన్ ఉంటేనే రాజకీయాల్లో రాణింపు సాధ్యం. ప్రతి సమస్య మీదా నేను బలంగా మాట్లాడుతున్నా, పోరాటం చేస్తున్నా.. దాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు మనకి మీడియా లేదు. ఇన్ని వ్యతిరేక శక్తుల మధ్య పోరాటం చేస్తున్నాం. భావజాలం ఉన్నవాడికి బలం ఉంటుంది. బాంబులు వేసినా చలించనంత బలం ఉంటుంది. అలాంటి బలం నా దగ్గర ఉంది. మన లక్ష్యం కోసం ఇప్పుడు పోరాటం చేద్దాం. అది తగ్గి పోరాటం చేయాల్సిన సమయంలో తగ్గే చేద్దాం. నిజమైన పోరాటం చేయాల్సినప్పుడు మీ అందరి కంటే ముందు నేనే నిలబడతాను అన్నారు.