శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (13:35 IST)

మతమార్పిడులపై చూపుతున్న శ్రద్ధ రైతుల పట్ల చూపడం లేదు : పవన్ కళ్యాణ్

నవ్యాంధ్రలో మతమార్పిడులపై చూపుతున్న శ్రద్ధ రైతు సమస్యల పరిష్కారంలో చూపడం లేదంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆయన బుధవారం చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మార్కెట్ యార్డును సందర్శించి, టమోటా రైతుల సమస్యలను తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, నవ్యాంధ్రలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మతమార్పిడులు అధికమయ్యాయని తెలిపారు. అంటే మతమార్పిడులపై చూపుతున్న శ్రద్ధ రైతు సమస్యల పరిష్కారంపై చూపడం లేదని వాపోయారు.
 
'వైకాపాకు ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చారు. ఆరు నెలల్లో వైసీపీ చేసింది ఏంటీ? మాజీ ముఖ్యమంత్రి ఇల్లును కూల్చేద్దాం. గతంలో ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేద్దాం.. అన్న విషయాలపైనే వారి దృష్టి ఉంది. అంతేకానీ రైతులకు గిట్టుబాటు ధర అందించడంపై లేదు. పవన్ కళ్యాణ్‌ను తిట్టాలి, అలా తిట్టే విషయాలపైనే వారి దృష్టి ఉంది' అంటూ విమర్శించారు. 
 
'రైతుల సమస్యలు పట్టించుకోవట్లేదు. రైతులందరూ మీపై తిరగబడతారు. అర్థం చేసుకోండి. మొదట రైతుల కడుపులు నింపండి. రైతులకు అండగా ఉండకుండా ఆంగ్ల మాధ్యమం గురించి మాట్లాడుతున్నారు. ప్రజలు, రైతుల క్షేమం కోసం నేను పర్యటనలు చేస్తున్నాను' అని స్పష్టం చేశారు.
 
'నేను ఇక్కడకు వస్తానని ప్రకటిస్తే నన్ను అడ్డుకుంటామని వైసీపీ నేతలు సవాళ్లు వదిలారు. మీరు మారాలి జగన్ రెడ్డి గారు. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు. కానీ, మాకు ప్రజల అండ ఉంది. మమ్మల్ని ఆపాలని ప్రయత్నిస్తే కుదరదు' అని పవన్ అన్నారు.
 
'వైసీపీ ప్రభుత్వం వచ్చి భవన నిర్మాణ కార్మికుల కడుపుకొట్టింది. ఇప్పుడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మత మార్పిడుల మీద ఉన్నంత ఉత్సాహం రైతుల సమస్యలు తీర్చేందుకు లేదు. వారికి అండగా ఉండే విషయంపై లేదు. అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు గిట్టుబాటు ధరపై నిర్ణయం తీసుకోవాలి. లేదంటే అమరావతిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తాను. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు' అంటూ జనసేనాని హెచ్చరించారు.