టిడిపిని ఎందుకు తిట్టడం లేదో చెప్పేసిన పవన్ కళ్యాణ్
గత మూడునెలల నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పైన, ఆ పార్టీ నేతలపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మొదట్లో మూడు నెలల పాటు సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా ఆ తరువాత ఇసుక కొరత, రైతుల ఆత్మహత్యలు ఇలా ఒకటి తరువాత ఒకటి జరుగుతుండటంతో జనంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని పవన్ కళ్యాణ్ చెపుతున్నారు.
రాష్ట్రంలో చురుగ్గా పర్యటిస్తూ వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే గత రెండురోజులుగా తిరుపతిలో పర్యటిస్తున్న జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి, చిత్తూరు, రాజంపేట, కడప జిల్లాలకు చెందిన పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
నాకు వైసిపి వాళ్ళు ఇంకో పేరు పెట్టారు. అదేంటో మీకు తెలుసు (పవన్ నాయుడు). టిడిపిలో నేను పార్ట్ బి అంటున్నారు వైసిపి నేతలు. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. టిడిపి ఓడిపోయిన పార్టీ. నేను ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ గురించి ఎందుకు మాట్లాడాలి అంటూ వైసిపి నేతలను ప్రశ్నించారు. నన్ను కొంతమంది అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. నేను ఆ మాటలను పట్టించుకోను. ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.. జనసేన అందుకే ఉంది అంటూ పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా ప్రసంగించారు. మొదటిసారి తెలుగుదేశంపార్టీని ఎందుకు విమర్శించడం లేదోనన్న విషయాన్ని బహిర్గతం చేశారు పవన్ కళ్యాణ్.