సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 నవంబరు 2019 (11:07 IST)

#6MonthsFailedCMJagan అప్పుల్లో రికార్డులు సృష్టిస్తున్న జగన్ : చంద్రబాబు

ఏడు నెలలు... 25 వేల కోట్ల రూపాయల అప్పులు. ఇది అభివృద్ధి కోసం చేసిన ఖర్చులు కాదు.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే గత ఏడు నెలల్లో బహిరంగ మార్కెట్ వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం. అంటే.. నెలకు మూడు వేల కోట్ల రూపాయల మేరకు రుణం తీసుకుంది. అంటే అధికారంలోకి వచ్చిన నేడు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు అప్పుల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. దీనిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
"6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది అప్పుల్లో రికార్డు సృష్టించడం. 6 నెలల్లో దాదాపు రూ.25 వేల కోట్లు అంటే నెలకు సుమారు మూడున్నర వేల కోట్ల అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు. ఒక్క ఆగష్టులోనే 5 సార్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది?". 
 
"వైసీపీ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇచ్చానని తిరిగి నన్నే ఆరోపిస్తున్నారు. పాలన చేతకాకపొతే సలహాలు తీసుకోవాలి. అంతేకాని అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా?"
 
"కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని అనుకున్నాం. కానీ వైసీపీ ప్రభుత్వం తొలిరోజు నుంచే విధ్వంసకర పాలన మొదలుపెట్టింది. ప్రజలకు నష్టం, కష్టం కలుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా చూస్తూ కూర్చోలేం కాబట్టే బాధితుల పక్షాన అటు న్యాయపోరాటం, ఇటు రాజకీయ పోరాటం చేస్తున్నాం".