శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 26 ఆగస్టు 2021 (16:51 IST)

అధిక ఫీజులు వసూలు చేసిన‌ కార్పోరేట్ విద్యా సంస్థలపై ఫిర్యాదు

రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసి అధిక ఫీజులు వసూలు చేసిన కార్పొరేట్ విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ),అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్), బీసీ,ఎస్సీ, ఎస్టీ సమాఖ్య సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. గురువారం బందరు రోడ్డులోని పాఠశాల విద్య నియంత్రణ,  పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ రేగా కాంతారావుకు  వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్,ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నిర్ధారిస్తూ జారీచేసిన జిఓ 53,54 లను స్వాగతిస్తున్నట్లు కమిషన్ చైర్మన్ కు తెలిపారు. 
 
విద్యా సంవత్సరం ప్రారంభమై ఇప్పటికి పది రోజులు గడుస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేశాయి. పాఠ్య, నోట్ పుస్తకాలు, దుస్తులు, నెక్ టై, ల్యాబ్, గ్రంథాలయం, అడ్మిషన్ తదితర పేర్లతో వేలాది రూపాయలు వసూలు చేశాయి. అర్బన్ ప్రాంతాల్లో గరిష్టంగా పదో తరగతికి 18,000, ఇంటర్మీడియట్ కోర్సుకు 20,000 వసూలు చేయాలని జీవోలు 53,54 లో కమిషన్ స్పష్టత ఇచ్చింది. 
 
టెక్నో, ఒలంపియాడ్,ఐఐటీ-జేఈఈ,స్మార్ట్ తదితర పేర్లతో కార్పొరేట్ పాఠశాలలు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. నీట్ శిక్షణ పేరుతో శ్రీ చైతన్య, నారాయణ కళాశాలలు వసతి గృహాలు ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఫిడ్జి,ఆకాష్, లాంటి సంస్థలు కేవలం ఐఐటీ-జేఈఈ,నీట్ శిక్షణ కోసం మూడు లక్షల నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. పదవ తరగతికి శ్రీ చైతన్య, నారాయణ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆంబిటస్, నలంద, భాష్యం తదితర పాఠశాలలు సుమారు లక్ష రూపాయల మేరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇప్పటికే ఆన్లైన్ తరగతుల పేరుతో కార్పొరేట్ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేశాయి. కార్పొరేట్ విద్యాసంస్థల అడ్డగోలు ఫీజుల దోపిడీ పై విచారణ నిర్వహించాల‌ని విద్యార్థి సంఘాలు డిమాండు చేస్తున్నాయి. వాటిపై చర్యలు తీసుకోవాల‌ని, త‌ల్లిదండ్రులకు ఫీజు వాపసు ఇప్పించాల‌ని, అలాగే, యాజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి నేతలు కమిషన్ చైర్మన్ రేగా కాంతారావును కోరారు. 
 
ఇప్పటికే త‌మ దృష్టికి కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల వసూళ్ల మీద ఫిర్యాదులు అందాయ‌ని, తప్పనిసరిగా కమిషన్ చర్యలు తీసుకుంటుందని విద్యార్థి నేతలకు ఆయన హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో పీ డీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు ఎ. రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రంగన్న, బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.చరణ్ సాయి, పీ డీ ఎస్ యూ నగర అధ్యక్షులు ఐ.రాజేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్ తదితరులు ఉన్నారు.