గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (08:20 IST)

ఇంటికే పింఛన్‌

ఇకపై పింఛన్‌ కోసం గంటల తరబడి వేచి చూసే బాధలు వీడనున్నాయి. పింఛన్‌దారుడి ఇంటి వద్దకే వలంటీరు వెళ్లి నేరుగా పింఛన్‌ అందించేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి జిల్లాలో ఈ ప్రక్రియను అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వార్డు, గ్రామ సచివాలయల పేరుతో బ్యాంకు ఖాతాలు ప్రారంభించే పనిలో సచివాలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
 
జిల్లాలో 4,22,220 మంది సామాజిక పింఛన్లు పొందే లబ్ధిదారులు ఉన్నారు. వితంతు, వృద్ధాప్య, చేనేత, గీత కార్మికులు, మత్స్య కారులు, డప్పు కళాకారులు, చర్మకారులు, అభయహస్తం, హిజ్రాలు, ఒంటరి మహిళలు పింఛన్లు పొందుతున్నారు. వీరికి ఇప్పటివరకు ప్రతినెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.

ఐదు రోజుల పాటు పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఏలు, వీఆర్వోలు, పురపాలకశాఖ అధికారులు, సిబ్బంది పింఛన్‌ను అందిం చేవారు. దీంతో పింఛన్ల పంపిణీలో జాప్యం జరిగేది. అయితే ఫిబ్రవరి నుంచి వలంటీర్ల ద్వారా పింఛన్‌ అందిం చే కార్యక్రమం చేపట్టనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో 50 కుటుంబాలకు, పట్టణ ప్రాంతాల్లో 100 కుటుంబాలకు ఒక వలంటీరు చొప్పున ఉన్నా రు. అన్ని కుటుంబాల్లో పింఛన్‌దారులు ఉండని నేపథ్యం లో ఒక్కో వలంటీరు సగటున 20 నుంచి 25 మంది లబ్ధిదారులకు పింఛన్‌ ఇవ్వనున్నారు. దీంతో ఇకపై ప్రతినెలా ఒకటో తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపే పింఛన్ల పంపిణీ పూర్తి కానుంది.
 
 
జనవరి ఒకటి నుంచే సచివాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని చెప్పినా కొన్ని సాంకేతిక కారణాలతో అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను నేరుగా ప్రజలకే చేరవేసేందుకు వలంటీర్లను నియమించారు. పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శులు ట్యాబ్‌ల ద్వారా వేలిముద్రలు సేకరించేవారు.

ఇకపై వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరగనుండటంతో వలంటీర్లకు ప్రత్యేక యాప్‌ ఉన్న సెల్‌ఫోన్లను అందజేశారు. వలంటీర్లు పింఛన్‌ లబ్ధిదారుడి వద్దకు వెళ్లి ఐడీ నెంబరును సెల్‌ఫోన్‌లో నమోదు చేస్తే వివరాలు వస్తాయి. తరువాత బయోమెట్రిక్‌ ద్వారా వేలిముద్రలు సేకరించి పింఛన్‌ అక్కడిక్కడే ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.
 
సచివాలయాల ఖాతాల్లోకే నగదు
ఇప్పటివరకు ఎంపీడీవోలు, పురపాలకశాఖ కమిషనర్ల ఖాతాల్లోకి పింఛన్‌ నగదును సెర్ఫ్‌ నుంచి జమ చేసేవారు. అనంతరం డివిజన్లు, వార్డులు, పంచాయతీల్లో ఉన్న పింఛన్‌దారుల సంఖ్యను బట్టి నగదును డ్రా చేసి పంచాయతీ కార్యదర్శులు, మునిసిపల్‌ సిబ్బందికి అందజేసేవారు.

ఇక నుంచి వార్డు, గ్రామ సచివాలయాల ఖాతాల్లోకే నేరుగా నగదును జమ చేయనున్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. ఈ ఖాతాల్లోకి సెర్ఫ్‌ నుంచి పింఛన్‌ సొమ్ము జమకానుంది.