తిరుమలకు ద్విచక్ర వాహనాల అనుమతి.. కానీ..?
తిరుపతి, తిరుమలలో వర్ష బీభత్సం కొనసాగిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా ఘాట్ రోడ్లు, కాలినడక మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో అటు స్థానికులకు ఇటు భక్తులు ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు.
వర్షం తగ్గినా వరద నీరు మాత్రం తగ్గకపోవడంతో ఘాట్ రోడ్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సరిగ్గా మూడు రోజుల క్రితం డౌన్ ఘాట్ రోడ్డులోనే తిరుపతి నుంచి తిరుమలకు.. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను అనుమతించారు.
ఒక రోజు మొత్తం ఇదే విధంగా వాహనాల రాకపోకలు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కొండచరియలు విరిగిపడిన రాళ్లను టిటిడి ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పక్కకు తొలగించి రెండవ ఘాట్ రోడ్‌ను సిద్ధం చేసి భక్తులకు అందుబాటులో ఉంచారు.
కానీ ఆర్టీసీ బస్సులు, భక్తులు వచ్చే కార్లు జీపులు మాత్రమే అనుమతించారు గాని ద్విచక్ర వాహనాలను అనుమతించలేదు. రోడ్డు డ్యామేజీ కావడంతో ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారికి ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో టీటిడి ఈ నిర్ణయం తీసుకుంది.
ఈరోజు ఉదయం నుంచి ఎండ తీవ్రత ఉండడంతో పాటు ఘాట్ రోడ్డులో సాధారణ స్థితి నెలకొనడంతో ద్విచక్ర వాహనాలను అనుమతిస్తున్నారు.
తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతికి కొన్ని నిబంధనలను పాటిస్తోంది టిటిడి. శ్రీవారి దర్శన టికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరి ఉన్న వారిని మాత్రమే ద్విచక్ర వాహనాల్లో అనుమతిస్తోంది. లేకుంటే ద్విచక్ర వాహన దారులను తిప్పి పంపేస్తోంది.