గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

తిరుమల కనుమ రోడ్ల పునరుద్ధరణ - నడక మార్గం మూసివేత

ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడటం వల్ల దెబ్బతిన్న తిరుమల ఘాట్ రోడ్లను అధికారులు తిరిగి పునరుద్ధరించారు. ఈ ఘాట్ రోడ్లపై భక్తుల వాహనాలను అనుమతిస్తున్నారు. 
 
ఇటీవల చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, తిరుమలలో కొండంత వర్షం కురిసింది. దీంతో తిరుపతి పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అలాగే, తిరుమలలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇవి ఘాట్ రోడ్లపై పడటంతో వాహన రాకపోకలను నిలిపివేశారు. 
 
దీంతో రంగంలోకి దిగిన తితిదే అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొండచరియలను తొలగించారు. అలాగే, దెబ్బతిన్న ఘాట్ రోడ్లకు తక్షణం మరమ్మతులు చేపట్టారు. ఈ పనులన్నీ పూర్తికావడంతో ఈ కనుమ రహదారిలో వాహన రాకపోకలకు అనుమతిస్తున్నారు. అయితే, ఇప్పటికి కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. 
 
అదేసమయంలో భక్తల కాలినడక మార్గంతో అలిపిరి మెట్ల మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. ఈ భారీ వర్షాలతో పాటు.. వర్షపు నీటి ప్రవాహానికి ఈ మార్గాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. దీంతో వీటికి మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయ్యేంత వరకు ఈ మార్గంలో భక్తలను అనుమతించరు.