సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 నవంబరు 2021 (22:10 IST)

హమ్మయ్య.. ఇక భయం లేదు.. ఘాట్ రోడ్ల రాకపోకలు ప్రారంభం

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి భారీ వర్షాలతో జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గొల్లవానిగుంట, మాధవ నగర్,  లక్ష్మీపురం ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది.  రహదారులు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
 
వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్ స్టేషన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల కింద భారీగా వర్షపు నీరు చేరింది. అటు కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. మరోవైపు తిరుమలలో వరద నీరు చేరడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. అలాగే భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో శుక్రవారం తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోవడం తెలిసిందే. 
 
యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగిన టీటీడీ ఇంజినీరింగ్ సిబ్బంది కొండచరియల నుంచి రాళ్లు పడకుండా తగిన ఏర్పాట్లు చేశారు. దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ఫలితంగా రెండో ఘాట్ రోడ్డుపై రాకపోకలు మొదలయ్యాయి. 
 
భారీ వర్షాలకు నిన్న తిరుమల ఘాట్ రోడ్డుపై 13 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక మార్గంలోనే వాహనాలను అనుమతించారు. ఇప్పుడు రెండో ఘాట్ రోడ్డు కూడా తెరుచుకోవడంతో కొండపైకి రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.