సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 19 నవంబరు 2021 (16:16 IST)

తిరుప‌తి రెండో ఘాట్ రోడ్డును పరిశీలించిన టిటిడి ఈఓ

భారీ వర్షం కారణంగా శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు తిరుమల, తిరుపతిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామ‌ని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. బస, అన్న ప్రసాదాలు తదితర ఏర్పాట్లు చేపట్టామన్నారు. శుక్రవారం ఆయన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు.

 
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, కొందరు పనిగట్టుకొని ఇతర ప్రాంతాలలో తీసిన వీడియోలు, ఫొటోలను తిరుమలలో తీసినట్టుగా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసి భయాందోళనకు గురి చేస్తున్నారని, భక్తులు వీటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. వర్షం కారణంగా రెండు ఘాట్ రోడ్లలో దాదాపు పది ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని తెలిపారు. గురువారం రాత్రి రెండు ఘాట్ రోడ్లను మూసివేశామన్నారు. తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటి ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలను తొలగించి శుక్రవారం ఉదయం రాకపోకలను పునరుద్ధరించినట్లు తెలిపారు. 
 

తిరుమల నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి తిరుమలకు ఈ మార్గంలోనే వాహనాలను అనుమతిస్తున్నట్లు వివరించారు. వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మార్గంలో రాకపోకలపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మీడియా ద్వారా భక్తులకు తెలియజేస్తామన్నారు. రెండో ఘాట్ రోడ్డులో కొండచరియల తొలగింపు పనులు పూర్తయ్యాయని, రోడ్డును శుభ్రం చేసిన అనంతరం భక్తులను అనుమతిస్తున్నామని చెప్పారు. తిరుమలలో ఉన్న భక్తులు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, వర్షం తగ్గినంత వరకు గదుల్లోనే ఉండాలని, అందరికీ అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. తిరుపతిలో ఉండిపోయిన భక్తులు శ్రీనివాసం, పద్మావతి నిలయం, గోవిందరాజ స్వామి సత్రాలకు వెళ్లి బస పొందవచ్చని, అక్కడ భోజన వసతి కూడా కల్పించామని తెలిపారు. దర్శన టికెట్లు బుక్ చేసుకుని వర్షం కారణంగా తిరుమలకు రాలేని భక్తులకు మరోసారి శ్రీవారి దర్శన సౌకర్యం కల్పిస్తామన్నారు.
 

అంతకు ముందు ఆయన తిరుమల జిఎన్ సి, నారాయణ గిరి గెస్ట్ హౌస్, మొదటి ఘాట్ రోడ్డులోని అక్కగార్ల గుడి ప్రాంతాలను పరిశీలించారు. ఆ తరువాత తిరుపతిలోని శ్రీ కపీలేశ్వరస్వామి ఆలయాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈఓ వెంట జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ 2 శ్రీ జగదీశ్వర రెడ్డి, డిప్యూటి ఈవో శ్రీ సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.