ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :vijayawada , మంగళవారం, 10 ఆగస్టు 2021 (13:01 IST)

వైసీపీకి, కేంద్ర బిజెపికి ఎక్క‌డ తేడా కొట్టింది?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. టీడీపీ, వైసీపీ మ‌ధ్య ఉప్పు...నిప్పులా ఎపుడూ చిట‌ప‌ట‌లాడుతూనే ఉంటుంది. కాకలు తీరిన రాజ‌కీయ నేత చంద్ర‌బాబుకు... న‌వ యువ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌ధ్య నిత్యం ఇక్క‌డ రాజ‌కీయ యుద్ధ‌మే న‌డుస్తుంది. మ‌ధ్య‌లో ఇపుడు జాతీయ పార్టీ బీజేపీ కూడా త‌యార‌యింది. దీనితో అనుక్ష‌ణం ఇక్క‌డ రాజ‌కీయ హాట్ టాపిక్ లే న‌డుస్తుంటాయి.

ఇది వరకు గుళ్లు, ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం, రథాలు తగలబెట్టిన అంశంపై పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత సైలెంటైన బీజేపీ... మళ్లీ ఇప్పుడు వాయిస్ పెంచింది. రోజుకో ప్రకటనతో... వైసీపీ నేతలకు టెన్షన్ తెప్పిస్తోంది. ఐతే... అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ఇలా ఎందుకు జరుగుతోంది... ఇప్పట్లో ఎన్నికలు లేవు కదా... అనే డౌట్ చాలా మందికి ఉంది. కొందరైతే, త్వరలోనే వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోందనీ, అందులో భాగంగానే ఇవన్నీ చేస్తోందని ఊహాగానాలు కూడా చేస్తున్నారు. అయితే, ఇదీ మ‌రీ విడ్డూరం. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని బీజేపీ అధికారంలోకి రావ‌డం ఏంట‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అయితే, అసలు విషయం అది కాదనీ... మరొకటి ఉందనే ప్రచారం ఢిల్లీ వర్గాల నుంచి వస్తోంది.

కేంద్రంలో దిగ్గ‌జంగా పేరొందిన అమిత్ షా, జాతీయ పార్టీ అయిన బీజేపీ వ్యూహాలు బలంగా ఉంటాయి. ఏ పార్టీనైనా తమలో కలుపుకోవడం లేదా... మిత్రపక్షంగా చేసుకోవడం ఆ పార్టీ నైజం. అలా కలవని పార్టీలకు చుక్కలు చూపిస్తారనేది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో బ‌లంగా నాటుకుపోయింది. బీహార్‌లో జేడీయూ చాలా ఏళ్లపాటూ... బీజేపీకి శత్రువుగా ఉండేది. తర్వాత మిత్రపక్షం అయిపోయింది. ఈమధ్య కేంద్ర కేబినెట్‌లోనూ చేరిపోయింది. ఇక సౌత్‌పై ఫోకస్ పెట్టిన కమలదళం... వైసీపీని ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. కేబినెట్ పోస్టులు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. వైసీపీని తమతో కలుపుకోవడానికి బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తే, ఆ పార్టీ మాత్రం ముంద‌స్తు వ్యూహంతో చివరి క్షణంలో... ఆఫర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

2014, 2019 ఎన్నికలకు ముందే వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సిద్ధపడితే, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరస్కరించారని సమాచారం. తాజాగా జులై 7న జరిగిన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా, మ‌రోసారి వైసీపీ నేతలతో చర్చలు జరిపి, కేబినెట్ పోస్టుల ఆఫర్ ఇచ్చారని సమాచారం. "ఓ కేబినెట్ పోస్టు, ఓ స్వతంత్ర ఇన్‌ఛార్జి, ఓ సహాయ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు. కానీ వైసీపీ రెండు కేబినెట్ బెర్తులు కావాలని కోరింది. అందుకు బీజేపీ పెద్దలు సిద్ధంగా లేరు. అదే సమయంలో వైఎస్ జగన్ కూడా, కేంద్రంతో కలిసే విషయంలో వెనక్కి త‌గ్గారు. కనీసం కేబినెట్ పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలో పేర్లు కూడా చెప్పలేదు." అని బీజేపీ వర్గాలు చెపుతున్నాయి.

బీజేపీ, వైసీపీ మధ్య ఇలాంటి డీల్ ఏదైనా కుదిరేలా చర్చలు జరిగాయా అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని, ఒక ప‌త్రిక ప్ర‌తినిధి అడిగితే... "కొన్ని చర్చలు జరిగాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే దీనిపై కామెంట్ చెయ్యాలి. ఆయనే ఏం జరిగిందో చెప్పాలి" అని అన్నట్లు స‌మాచారం. చివరకు వైఎస్ జగన్... బీజేపీతో కలవకూడదనీ... ఎప్పటిలాగే... కేంద్రంతో ఫ్రెండ్లీగా ఉంటూ... అంశాలవారీగా మద్దతివ్వడం మేలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2014 నుంచి వైసీపీ, బీజేపీకి దూరంగానే ఉంటోంది. అంశాల వారీగా మాత్రమే మద్దతిస్తోంది. తాజా పరిస్థితులను చూస్తే, భవిష్యత్తులో ఆ పార్టీని కేంద్రంలో కలుపుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

2024 లోక్‌సభ ఎన్నికల నాటికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ వ్యతిరేక శక్తులను ఒక తాటిపైకి తెచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో వైసీపీని తమ వైపు తిప్పుకోవడం ద్వారా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోందని సమాచారం. ఇదే సమయంలో వైసీపీని, బీజేపీ వ్యతిరేక కూటమిలోకి తేవడానికి ప్రశాంత్ కిషోర్ చేస్తున్న ప్రయత్నాలు బీజేపీకి ఇబ్బందిగా మారుతున్నాయి. 2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేలా ప్రశాంత్ కిషోర్ టీమ్ పనిచేసింది. అందువల్ల బీజేపీకి వ్యతిరేకంగా ఆయన వైసీపీని తనవైపు తిప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.

2019 ఎన్నికల్లో లోక్‌సభలో పార్లమెంటరీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలకు, 151 వైసీపీ గెలుచుకుంది. వ‌చ్చే 2024 ఎన్నికల్లో కూడా వైసీపీకి ప్రశాంత్ కిషోర్ టీమ్ పనిచేస్తుందనే టాక్ ఉంది. ఈ మధ్య ఢిల్లీ వెళ్లొచ్చిన మమతా బెనర్జీ తనకు వైసీపీ, బీజేడీతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పార‌ట‌. మరి బీజేపీతో వైసీపీ చేతులు కలుపుతుందా అన్న ప్రశ్నకు విజయ్ సాయి రెడ్డి "ఇది రాజకీయ నిర్ణయం. ఇది ముఖ్యమంత్రే తీసుకుంటారు" అని చెప్పినట్లు తెలిసింది. 2024 ఎన్నికల నాటికి వైసీపీతో ముందస్తు ఒప్పందం చేసుకునేలా కమలనాథులు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఆ పార్టీకి కేంద్రంలో శివసేన, శిరోమణి అకాళీ దళ్ దూరమయ్యాయి. అందువల్ల దక్షిణాది నుంచి ప్రాంతీయ పార్టీల మద్దతు ఉంటే మంచిదని ఢిల్లీ పాలక వర్గం భావిస్తున్నట్లు తెలిసింది. వైసీపీకి బీసీలు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల నుంచి సపోర్ట్ ఉంది. ఇప్పుడు మా పార్టీ బీజేపీతో కలిస్తే... ఈ సపోర్ట్ ఉండకపోవచ్చు అని వైసీపీ ఎంపీ ఒక‌రు తెలిపారు. ఐతే ఏపీ సీఎంకి కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరం జరుగుతాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికలూ ముందున్నాయి. ఇవి రాజకీయ గాలి ఎటు వీస్తుందో బయటపెడతాయి. తదనుగుణంగా వైసీపీ భవిష్యత్ నిర్ణయాలు తీసుకునేందుకు వీలుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, బీజేపీ కోసం మ‌రో ప‌క్క చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఇప్ప‌ట్లో ఫ‌లించేలా క‌నిపించ‌డం లేదు.