శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (20:36 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది? సర్వే ఆఫ్ ఇండియా ఏం చెబుతోంది? (Video)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అన్న అంశం ఇపుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే... గత టీడీపీ సర్కారు నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది. ఆ తర్వాత రాజధాని అమరావతి నిర్మాణానికి సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేశారు. ఈ శంఖుస్థాపన తర్వాత ఏపీ సర్కారు కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి అమరావతి నిర్మాణానికి పూనుకుంది. ఇందులోభాగంగా, తాత్కాలిక భవనాల్లో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీని నియమించి, వాటిలోనే గత ఆరేళ్లుగా పాలన సాగుతోంది. 
 
అయితే, గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. తెదేపా స్థానంలో వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసి... మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంటే అమరావతిలో శాసన రాజధాని, వైజాగ్‌లో కార్యనిర్వహణా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ దిశగానే జగన్ సర్కారు వడివడిగా అడుగులువేస్తోంది. జగన్ సర్కారు దూకుడుకు న్యాయస్థానాలు బ్రెకులు వేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్చామని సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయం తెలిపింది. ఈ మేరకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్‌ ప్రదీప్‌సింగ్ లేఖ రాశారు. ఉన్నతాధికారుల ఆమోదంతో ఈ లేఖను విడుదల చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎంపీ గల్లా జయదేవ్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
 
భారతదేశ అధికారిక మ్యాపులో ఏపీ రాజధాని అమరావతి అన్న అంశాన్ని పేర్కొనలేదన్న విషయాన్ని తాను 2019 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లేవనెత్తానని చెప్పారు. దీంతో సర్వే ఆఫ్ ఇండియా ఈ అంశాన్ని పరిశీలించి తాజాగా ప్రకటన చేసిందని, ఏపీ రాజధానిగా అమరావతి పేరును పేర్కొంటూ మ్యాపును అప్‌డేట్ చేసిందని ట్వీట్ చేశారు. 
 
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది రిలీజ్ చేసిన భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడం వివాదాస్పదమైంది. ఇండియా మ్యాప్‌లో అమరావతిని పేర్కొనకపోవడాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ 2019 నవంబర్ 21న జరిగిన 17వ లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో లోక్‍సభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. 
 
అమరావతి పేరు లేకపోవడం ఏపీ ప్రజలతో పాటు, రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీని కూడా అవమానించినట్టేనని తెలిపారు. అమరావతితో కూడిన మ్యాప్‌ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో గల్లా జయదేవ్ అమరావతి విషయమై మాట్లాడిన మరుసటి రోజే.. అమరావతితో కూడిన ఇండియా మ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. 
 
ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించడంతో పాటు కొత్త మ్యాప్‌ను కూడా పోస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై ఉన్నతాధికారుల ఆమోదం మేరకు ఇప్పుడు గల్లా జయదేవ్‌కు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది.