శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (09:22 IST)

మాటకు కట్టుబడిన జనాభిమాన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి: మంత్రి పేర్ని నాని

ఎన్నికల సమయంలో అమలు చేస్తానని చెప్పిన ప్రతి హామీ నెరవేర్చుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి గా  జగన్మోహనరెడ్డి జనాభిమాన నేతగా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొంటున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) స్పష్టం చేశారు.

తన కార్యాలయం వద్దకు వివిధ ప్రాంతాల నుంచి  పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను  ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఇబ్బందులను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించి కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని, ఈ పథకాన్ని మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారన్నారు.

ఇప్పటికే వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద ప్రతి నెలా పెన్షన్‌ అందుకుంటున్న పలు వర్గాల మహిళలకు కూడా నాలుగేళ్లలో రూ.75 వేలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ నిర్ణయంతో పెన్షన్‌ కానుక అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత, మత్స్యకార మహిళలకూ లబ్ది చేకూరనుందన్నారు. 

వైఎస్సార్ చేయూత ఈ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న 8.21 లక్షల మందికిపైగా మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందించనున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇప్పటికే లబ్ధిదారులు జూన్‌ 28 నుంచి దరఖాస్తులు ఇచ్చారు.

కానీ ప్రభుత్వ పింఛన్ తీసుకుంటున్న మహిళలకు కూడా జగన్ ఇప్పుడు అవకాశం కల్పించడం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీసుకొన్న ఎంతో గొప్ప సాహేసోపేత నిర్ణయమని ప్రశంసించారు. రాష్ట్రానికి ఇది ఆర్థికంగా భారమైనప్పటికీ వారికి కూడా వైఎస్సార్‌ చేయూత కింద ప్రయోజనాలను అందించాలని నిర్ణయం తీసుకొని ఆ మేరకు వారినీ పరిగణనలోకి తీసుకోవడం ప్రజల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో గ్రహించ వచ్చన్నారు.

ఈ పథకం కింద ఏడాదికి రూ.1,540 కోట్లకు పైగా, నాలుగేళ్లలో రూ.6,163 కోట్ల మేర ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుందని మంత్రి పేర్ని నాని వివరించారు. 

మచిలీపట్నం  2 వ డివిజన్ కు  చెందిన పలువురు మహిళలు మంత్రి ఎదుట తమ గోడు వెళ్లబోసుకొన్నారు. జగనన్న చేదోడు పథకంలో భాగంగా రజక, నాయీ బ్రాహ్మణ, టైలరింగ్‌ వృత్తిదారులకు ఏడాదికి రూ.10 వేలు రూపాయలు ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అయితే తమ వార్డు సచివాలయాలలో అర్హులైన టైలరింగ్, కాపు నేస్తం, బీ సి నేస్తం  లబ్ధిదారులకు సంబంధించిన జనన ధ్రువీకరణ నమోదు ఆన్లైన్ లో కావడంలేదని తెలిపారు.

ఈ విధంగా ఎందుకు జరుగుతుందని 2 వార్డు ఇంచార్జ్ పరింకాయల విజయచందర్ ను మంత్రి పేర్ని నాని అడిగారు. సచివాలయంలో తరచూ ఇదే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు డివిజన్ లో  పలువురు పిర్యాదు చేస్తున్నారని ఆన్లైన్ ఇబ్బందులు ఎదురవ్వడం, నిత్యం  సర్వర్ డౌన్ కావడంతో సచివాలయాలలో ఆయా వివరాలు నమోదు కావడం లేదని విజయ్ మంత్రికి విన్నవించారు.

ఈ విషయమై స్పందించిన మంత్రి జవాబు ఇస్తూ, తానూ ఇదే సమస్యపై కలుగుతున్న ఇబ్బందుల గూర్చి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, జులై మాసాంతంలోపున ఆ సమస్య పరిష్కారం కాగలదని లేనిపక్షంలో ఆగష్టు 2 వ తారీఖు లేదా 3 వ తారీఖున సచివాలయంలో ఉండి మరోమారు యత్నించమని నమోదు కాకపోతే తిరిగి తనకు తెలియచేయమని మంత్రి పేర్ని నాని ఇంచార్జ్ విజయ్ కు తెలిపారు. 

మచిలీపట్నం రైతుబజారులో  గత 4 నెలలుగా దుకాణాలు తెరవడం లేదని కానీ , అధికారులు 12 దుకాణదారులను అద్దె చెల్లించమని  అడుగుతున్నారని, వ్యాపారాలు లేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని సంబంధిత అధికారులకు ఒక మాట చెప్పి తమను కాపాడాలని వి. రత్నం, కిరణ్ మంత్రి పేర్ని నానికు విజ్ఞప్తి చేశారు.