శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (22:57 IST)

కొత్త డ్రైవింగ్‌ లైసెన్స్‌ల స్లాట్‌ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలుపుదల: మంత్రి నాని

లాక్‌ డౌన్‌ కారణంగా లెర్నర్‌ లైసెన్స్‌లు కొత్త డ్రైవింగ్‌ లైసెన్స్‌ల స్లాట్‌ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు.
                                    
శుక్రవారం అయన తన కార్యాలయం వద్ద ప్రజల నుండి పేద ఎత్తున వినతిపత్రాలు స్వీకరించారు. మచిలీపట్నం వర్రేగూడెంకు చెందిన టాక్సీ డ్రైవర్ ఎం.డి. అతహార్ బేగ్ మంత్రి పేర్ని నానిని కల్సి తన ఇబ్బందిని తెలిపారు.

వృత్తిపరంగా తాను కారు డ్రైవర్ అయినప్పటికీ ఆన్లైన్ లో తాను రెండు కార్లకు యజమానిగా చూపుతుందని దీంతో పలు ప్రభుత్వ పథకాలకు తాను అనర్హుడిగా మారుతున్నానని, దీనిని మార్పు చేసుకొనేందుకు రవాణా శాఖాధికారుల వద్దకువెళ్లినా ఇప్పటికి ఇప్పుడు మార్చడం కుదరదని ఉన్నత స్థాయిలో ఆ మార్పు చేయాలనీ చెబుతున్నట్లు మంత్రికి తెలిపారు.

దీనిపై తక్షణమే స్పందించిన ఆయన డిటిసి ఎస్‌.వెంకటేశ్వరరావు తో మాట్లాడేరు. కారు లేకపోయినా లేదా టాక్సీ కారు వున్నా కూడా ప్రయివేట్ కారుగా ఉండటంతో రవాణాశాఖ విభాగం నుండి తిరస్కరణ వస్తుందని దీంతో కారు నడుపుకొనేవారినే ఓనర్ గా ఆన్లైన్ లో చూపడంతో అనేక సంక్షేమ కార్యక్రమాలలో వారికేమీ దక్కడం లేదని డి టి సి కు సూచించారు.

ఈ విషయమై సివిల్ సప్లై కమీషనర్ తో మాట్లాడేనని, ఏ జిల్లాకు చెందిన రవాణాశాఖాధికారులు ఇచ్చిన సమాచారం మేరకే తాము అర్హులను ఎంపిక చేశామని, ఆన్లైన్ లో తలయెత్తుతున్న సమస్యలను ఏ జిల్లాకు చెందిన డి టి సీలు వెంటనే సరి చేయాలనీ ఆదేశించారు. 

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, కరోన వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విజయవాడ రవాణా శాఖ కార్యాలయానికి ఎక్కువ శాతం ప్రజలు రాకుండా ఉండేందుకు వాట్సప్‌ 9014356778 ద్వారా సేవలందించాలని సూచించినట్లు తెలిపారు. వాట్సప్‌ నెంబర్‌ కు మెస్సేజ్‌ రూపంలో గాని, ఫోన్‌ చేసి గాని రవాణాశాఖ సేవలను పొందవచ్చన్నారు. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ నడుస్తున్నందు వల్ల ఆన్‌లైన్‌ విధానంలో సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

రవాణా శాఖకు సంబంధించి శాఖాపరమైన ఏ సమాచారమైనా ఉదయం10.30 నుండి సాయంత్రం 5 గంటల లోపు వాట్సప్‌ ద్వారా కానీ, ఫోన్‌ చేసి తగిన సమాచారం తెలుసుకోవచ్చన్నారు. సెకండ్‌ వెహికల్‌ వెరిఫికేషన్‌ కోసం, సీజ్‌ చేసిన వాహనాల విడుదల కోసం విజయవాడ డిటీసీ కార్యాలయంనకు రాకుండానే వాట్సప్‌ నెంబరుకు తెలియజేస్తే ఆ ఇబ్బందులు తొలిగిపోతాయని చెప్పారు. స్మార్ట్‌ కార్డులు అందకపోయినా వాటి వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా కానీ లేదా వాట్సప్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

వాహన చోదకులు, యజమానుల చిరునామాలు సరిగ్గా లేని కారణంగా తపాలాశాఖ ద్వారా వెనక్కి తిరిగి వచ్చిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ల స్మార్ట్‌ కార్డులను ప్రతి గురువారంనాడు, అలాగే వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ల స్మార్ట్‌ కార్డులను ప్రతి శుక్రవారం కార్యాలయంలో అందచేస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు.

సరైన చిరునామాలు లేని కారణంగా వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు, డ్రైవింగ్‌ లైసెన్సులకు సంబందించిన స్మార్ట్‌ కార్డులు తిరిగి కార్యాలయాలకు చేరుతున్నాయన్నారు. ఇకపై వీటిని కార్యాలయాల్లో అందజేయడం జరగదని, ఆన్‌ లైన్‌లో చిరునామా మార్పు చేసుకుంటేనే పోస్టు ద్వారా పంపించడం జరుగుతుందన్నారు.

తహసీల్దార్ కార్యాలయాలలో తాత్కాలిక పద్దతిలో పని చేసే విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్లు సేకరించిన విరాళాలు కోవిడ్ - 19 వ్యాధి నిర్మూలనకు ముఖ్యమంత్రి సహాయనిధికి 30,500 రూపాయల డి డి ను మంత్రి పేర్ని నాని స్వహస్తాల మీదుగా అందచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపత్కర పరిస్థితులలో మానవత్వంతో రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్లు స్పందించిన తీరు అమోఘమన్నారు. ఈ డిడి అందచేత కార్యక్రమంలో కృష్ణాజిల్లా రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్ల అధ్యక్షుడు నెమలికంటి శ్రీనివాస్, అబ్దుల్ హాదీ , గోవాడ వెంకటేశ్వరరావు , చేతన్ సాయి, మనీంద్ర దాస్ తదితరులు పాల్గొన్నారు.