గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 12 జులై 2023 (15:01 IST)

రూ.15 కోట్లు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్‌ను ఓడించిన టీడీపీ : పోసాని కృష్ణమురళి

posani krishnamurali
గత ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం టీడీపీయేనని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. భీమవరంలో పవన్‌ను ఓడించేందుకు టీడీపీ రూ.15 కోట్లు ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, భీమవరంలో పవన్ కల్యాణ్ ఓడిపోయే అవకాశమే లేదని, అక్కడ ఓడిపోవడానికి కారణం ఎవరో తెలుసుకోవాలని పవన్‌కు ఆయన హితవు పలికారు. పవన్ ఓటమికి వైసీపీ కారణం కాదన్నారు. భీమవరంలో రూ.15 కోట్లు ఖర్చు పెట్టి మరీ పవన్‌వద్దంటూ టీడీపీ ప్రచారం చేసిందని పోసాని ఆరోపించారు.
 
ఈ విషయంపై కావాలంటే విచారణ జరిపిస్తే నిజం తెలుస్తుందన్నారు. పవన్ నమ్మే నేతలు ఆయనను ఎన్నటికీ ముఖ్యమంత్రిని చేయరని పోసాని చెప్పారు. పొరపాటున పవన్ ముఖ్యమంత్రి అయితే అందరూ కలిసి ఇలాగే ప్రెస్మీట్‌లు పెట్టి తిడతారని చెప్పారు.
 
ఆరోపణలు చేయడంలో తప్పులేదని, అయితే ఆరోపణలు చేయడానికి తగిన ఆధారాలు చూపాలన్నారు. ఇప్పుడు తాను పెట్టిన ప్రెస్మీట్‌పైనా ఆరోపణలు చేయొచ్చన్నారు. పోసాని డబ్బులు తీసుకుని ప్రెస్మీట్లు పెడతాడని ఆరోపించవచ్చు.. అయితే, నేను ఎవరి దగ్గరి నుంచి డబ్బులు తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నాననే వివరాలు కూడా చెప్పాలన్నారు.
 
వేల మంది అమ్మాయిలు పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, పవన్ రాజకీయ జీవితానికి కూడా మంచిది కాదని పోసాని చెప్పారు. పొరపాట్లు చేయడం తప్పు కాకపోవచ్చు కానీ చేసిన పొరపాటు గుర్తించి క్షమాపణ చెప్పడం హుందాతనమని పోసాని కృష్ణమురళి అన్నారు.