శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 21 డిశెంబరు 2021 (16:33 IST)

తెలంగాణా విద్యుత్‌ బకాయిలు... మీరే వ‌సూలు చేసుకోవాలి!

విద్యుత్‌ బకాయిల చెల్లింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య నెలకొన్నవివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఉభయులకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, తెలంగాణ 6,111 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలు చెల్లించడం లేదని, కేంద్ర జోక్యం చేసుకుని బకాయిలు చెల్లించేలా కృషి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఈ ఏడాది జూలై 14న తమకు లేఖ రాసినట్లు చెప్పారు. 
 
 
విద్యుత్‌ సరఫరా ఒప్పందం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం. రాష్ట్ర విభజన తర్వాత ఉభయ రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం జరిగింది. మొదట్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి పొందిన విద్యుత్‌కు తెలంగాణ చెల్లింపులు జరిపింది. విద్యుత్‌ చార్జీలకు సంబంధించి తెలంగాణ బకాయిపడ్డ సొమ్ములో అసలుపై ఎలాంటి వివాదం లేదు. అసలుపై విధించిన వడ్డీ విషయంలోనే రెండు రాష్ట్రాల మధ్య పేచీ వచ్చిందని మంత్రి తెలిపారు. 
 

ఈ వడ్డీ చెల్లింపుపై పవర్‌ పర్చేజ్‌ ఒప్పందంలోని షరతులకు లోబడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సామరస్య ధోరణిలో రాజీకి రావలసి ఉంటుందని మంత్రి అన్నారు. విద్యుత్‌ బకాయిల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేయడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలంగాణ హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ అంశం కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున ఉభయ రాష్ట్రాలు సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకోవడమే మార్గమని అన్నారు.