జీవీ రెడ్డి రాజీనామా.. ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఏపీ ఫైబర్ నెట్‌లో భారీగా అవినీతి చోటుచేసుకున్న ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తన చైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న దినేశ్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం జీఏడీకి బదిలీ చేసింది. అదేసమయంలో కొత్త ఎండీగా ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్యను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్‌లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వాటిపై దృష్టిసారించింది. అదే సమయంలో ఫైబర్ నెట్‌లో చైర్మన్, ఎండీ మధ్య విభేదాల వ్యవహారం కూడా ప్రభుత్వానికి అసహనానికి గురిచేసింది.
దీనికి సంబంధించిన నివేదిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు చేరిన కొద్ది సమయంలో ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం, ఎండీ పదవి నుంచి దినేశ్ కుమార్‌ను తప్పించడం అగమేఘాలపై జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను ప్రభుత్వం నియమించింది.