సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 డిశెంబరు 2020 (08:44 IST)

కరోనా వ్యాక్సినేషన్‌ కోసం ఏర్పాట్లు చేయండి.. ఏపీ వైద్య శాఖ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి చెక్ పెట్టేందుకు కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఈ నెలాఖరు నుంచి వేయనున్నారు. ప్రజలకు ఈ టీకాలు వేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపట్టాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ కోసం కచ్చితమైన ప్రదేశాలు గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 
 
హెల్త్‌కేర్‌ వర్కర్లతో పాటు పోలీసులు, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల సిబ్బందికి కూడా ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది హోదాలో వ్యాక్సిన్‌ అందించాలని సూచించింది. ఆ తర్వాత 50ఏళ్లు దాటి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారికి వ్యాక్సిన్‌ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ప్రతి కేంద్రంలోనూ ఐదుగురు వ్యాక్సినేషన్‌ అధికారులను జిల్లా కలెక్టర్లు ముందుగానే గుర్తించాలని సూచించింది. 
 
ప్రతి జిల్లాల్లోలో కార్డియాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ వైద్యులతో ఒక ప్రత్యేక కమిటీని కలెక్టర్లు నియమించడంతో పాటు ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా 10 పడకలు అందుబాటులో ఉంచుకోవాలి. ప్రతి వ్యాక్సినేషన్‌ను సెంటర్‌ను ముందుగానే మ్యాపింగ్‌ చేసి సమీప సీహెచ్‌సీకి అనుసందానం చేయాలి. టీకా కేంద్రాలతో పాటు రీజినల్‌, జిల్లా వ్యాక్సిన్‌ స్టోర్లు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచాలన్నారు. 
 
ప్రతి జిల్లాలో కాల్‌సెంటర్‌తో పాటు కంట్రోల్‌ రూమ్స్‌ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో 104 కాల్‌సెంటర్‌ను ఆరోగ్యశాఖ అందుబాటులో ఉంచుతోంది. డీఐవో, డీపీఎంవో, డిప్యూటీ డీఎంహెచ్‌వో, డీటీసీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ అధికారి, ఎలక్ట్రిసిటీ అధికారి, జిల్లా కలెక్టర్‌ నియమించిన వైద్యుల కమిటీ 24 గంటలు కంట్రోల్‌ రూమ్‌లోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ఈ నెల 25 నాటికి ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆరోగ్యశాఖ ఆదేశించింది.