సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 మార్చి 2017 (18:21 IST)

ఏప్రిల్ 2న ఫ్యాన్స్‌తో రజనీకాంత్ భేటీ.. రాజకీయ అరంగేట్రంపై కీలక ప్రకటన?

తమిళనాట రాజకీయాలు అమ్మ మరణానంతరం మరింత దిగజారిపోయిన తరుణంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై రంగం సిద్ధం చేసుకుంటున్నారని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లోకి తాను వచ్చేది

తమిళనాట రాజకీయాలు అమ్మ మరణానంతరం మరింత దిగజారిపోయిన తరుణంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై రంగం సిద్ధం చేసుకుంటున్నారని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లోకి తాను వచ్చేది లేదని ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన రజనీకాంత్.. ఇక లాభం లేదనుకుని.. రాజకీయ సీన్లోకి దిగేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
 
రజనీకాంత్ రాజకీయాల్లో రావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుతున్న సంగతి తెలిసిందే. వివిధ రాజకీయ పార్టీలు కూడా రజనీ మద్దతు కోసం వేయి కనులతో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2న ఏర్పాటయ్యే సమావేశానికి హాజరు కావాలని కబాలి హీరో రజనీకాంత్ అభిమానులకు పిలుపునివ్వడం తాజా చర్చకు దారితీసింది. 
 
ఏప్రిల్ రెండో తేదీన రజనీకాంత్ అభిమాన సంఘ నేతలతో సమావేశం కానున్నారు. అయితే ఈ భేటీకి తగిన అజెండా ఏమిటనేది మాత్రం స్పష్టంగా తెలియదు. దీంతో రజనీకాంత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకే ఫ్యాన్స్‌తో చర్చించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. అంతేగాకుండా ఏప్రిల్ 2 సమావేశానికి అనంతరం రజనీ ఏం చెప్తారోనని అభిమానులతో పాటు తమిళ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
అయితే.. ఇది కేవలం అభిమాన సంఘనాయకులతో సమావేశం మాత్రమేనని రజనీ సన్నిహితులు చెప్తున్నారు. మరోవైపు శ్రీలంకలో తమిళులను కలవవద్దంటూ పలు పార్టీలు సూచించిన నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకుని, బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో ఆయన ఏప్రిల్ 2న అభిమానులంతా చెన్నై రావాలని లేఖలు రాయడంతో ఆయన రాజకీయాల్లోకి రానున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.