గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (10:06 IST)

ఏపీ నుంచి కియా వెళ్లిపోవడం ఖాయం.. రాయిటర్స్ స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశం రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన కార్ల ఉత్పత్తి సంస్థ కియా మోటార్స్ కంపెనీ మరో రాష్ట్రానికి తరలివెళ్లడం ఖాయమని రాయిటర్స్ పునరుద్ఘాటించింది. గతంలో తాము ప్రచురించిన కథనానికి కట్టుబడివున్నానీ, ఈ కథనానికి కొన్ని మార్పులు చేసి, మళ్లీ ప్రచురించినట్టు రాయిటర్స్ మరోమారు ట్వీట్ చేసింది. 
 
కియా మోటర్స్ సంస్థ 1.1 బిలియన్ డాలర్ల విలువైన ప్లాన్‌ను ఏపీ నుంచి తరలించేందుకు చర్చలు జరుపుతోందని తమకు సమాచారం ఉందంటూ రాయిటర్స్ ట్వీట్ చేసింది. అలాగే పాత ట్వీట్‌ను డిలిట్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది. దీంతో పాటు ఈ నెల 5న తమ వైబ్‌సైట్‌లో కియా మోటర్స్ తరలిపోతున్నట్టు రాసిన కథనంలో మార్పులు చేసి ఆ లింకును మరోసారి ట్విట్టర్‌లో జోడించింది. 
 
కొత్త ప్రభుత్వం తమ పాలసీలో మార్పు చేయడంతో ఏపీ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు ప్లాంట్‌ను తరలించేందుకు కియా సంస్థ చర్చలు జరుపుతోందని రాయిటర్స్ తెలిపింది. తరలింపు ఖర్చును కూడా తమిళనాడు ప్రభుత్వం బరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తమ కథనంలో రాసుకొచ్చింది. తమిళనాడు ప్రభుత్వం అధికార వర్గాలు కూడా ఈ అంశాన్ని ధృవీకరించినట్టు స్పష్టం చేసింది. 
 
ఏపీ నుంచి ప్లాంట్ తరలింపునకు గల కారణాలను ఇటీవల జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్ పోలో కియా ప్రతినిథులను రాయిటర్స్ సంప్రదించినట్టు సమాచారం. ఏపీ ప్రభుత్వ వర్గాల్లో కొందరి నుంచి ఉచితంగా కార్లు కావాలంటూ వేధింపులు వస్తున్నాయని, అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్ చేస్తున్నారని, అలాగే డీలర్స్ షిప్స్, ఇన్‌సెంటివ్స్‌లో మార్పులు చేయాలంటూ బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయని కూడా రాయిటర్స్ వివరించింది. ఇలాంటి కారణాల రీత్యా కియా మోటార్స్ కంపెనీ తమిళనాడుకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.