సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 6 ఫిబ్రవరి 2020 (16:00 IST)

కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతోందా? ఆ సంస్థ ప్రతినిధి బీబీసీతో ఏమన్నారు?

కియా మోటార్స్
కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిపోతోందనే వార్తలు రెండు రోజులుగా రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి. రూ. 7,800 కోట్ల (110 కోట్ల డాలర్లు) విలువైన కార్ల తయారీ ప్లాంట్‌ను ఉత్పత్తి ప్రారంభించిన కొన్ని నెలలకే అక్కడి నుంచి తరలించడానికి కియా సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని రాయిటర్స్ ఇండియా ఫిబ్రవరి 5న ఒక వార్తను ప్రచురించింది.

 
కియా కార్ల తయారీలోని దాదాపు అన్ని రకాల విడిభాగాలు తమిళనాడులోనే తయారవుతుండటం, కొద్ది కాలంగా ఏపీ ప్రభుత్వ విధానాలు మారుతుండటం వంటి కారణాలతో కియా సంస్థ తన ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నుంచి తమిళనాడుకు తరలించాలనే యోచన చేస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వాధికారులు తమతో చెప్పారని కూడా ఆ కథనంలో రాయిటర్స్ పేర్కొంది.

 
ఈ మేరకు ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగాయని, వచ్చే వారంలో కార్యదర్శుల స్థాయిలో చర్చలు మొదలవుతాయని తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వాధికారి తమతో చెప్పారని కూడా ఆ కథనంలో రాశారు. దాంతో, గత రెండు రోజులుగా ఈ అంశం ఏపీలో చర్చనీయంగా మారింది.

 
బీబీసీతో కియా మోటార్స్ ఏం చెప్పింది?
ఈ వార్తలో వాస్తవం ఏమిటో తెలుసుకునేందకు కియా మోటార్స్ ఇండియాతో బీబీసీ తెలుగు మాట్లాడింది. "రాయిటర్స్ ఇండియా ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవం. మేం ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగుతాం" అని కియామోటార్స్ ఇండియా అధికార ప్రతినిధి శ్యామ్ అన్నారు.

 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ వార్త పూర్తిగా నిరాధారమని చెప్పింది. తాము కియా సంస్థతో కలిసి పని చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి వివరణ కోసం తమిళనాడు ప్రభుత్వ అధికారుల్ని కూడా బీబీసీ సంప్రదించింది. తన పేరు వెల్లడించవద్దని కోరిన తమిళనాడు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు, " కియా సంస్థ మమ్మల్ని ఎప్పుడూ సంప్రదించలేదు. మేం కూడా వారితో ఎలాంటి చర్చలు జరపలేదు" అని చెప్పారు.

 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 2017లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసింది. రెండేళ్లలోనే నిర్మాణాన్ని పూర్తి చేసుకొని 2019 ద్వితియార్థం నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఏడాదికి 3 లక్షల కార్ల తయారు చేసే సామర్థ్యం గల ఈ ప్లాంట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 12 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది.

 
కియాపై పార్లమెంట్‌లో చర్చ
కియా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతోందంటూ మీడియాలో వచ్చిన కథనాలను తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో జీరో అవర్‌లో ప్రస్తావించారు. ప్రభుత్వ వ్యవహర శైలి కారణంగానే కీలక పరిశ్రమలు తరలిపోతున్నాయని తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇది విదేశీ పెట్టుబడులకు సంబంధించిన విషయమని కేంద్రం తప్పనిసరిగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 
దీనిపై స్పందిస్తూ వైస్సార్‌ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డి, మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తమని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. తాను ఈ ఉదయమే కంపెనీ ఎండీతో మాట్లాడానని మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారమవుతున్నాయని, తాము కూడా ఈ వార్తల్ని ఖండించామని చెప్పినట్టు మిథున్ రెడ్డి అన్నారు.