1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 మార్చి 2016 (12:57 IST)

సస్పెన్షన్‌పై మళ్లీ సుప్రీం గడప తొక్కిన రోజా: చంద్రబాబుపై విసుర్లు!

ఏడాది పాటు సస్పెన్షన్.. సుప్రీం కోర్టు ఆశ్రయించిన రోజా.. చంద్రబాబుపై మండిపాటు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైకాపా ఎమ్మెల్యే రోజా.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యే రోజాను ఏపీ శాసనసభ ఏడాదిపాటు సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో రోజా సస్పెన్షన్‌ను హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ రద్దు చేసింది. దీనిపై ఏపీ శాసనసభ కార్యదర్శి డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేయగా... సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే, తనపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రోజా ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశాల ప్రకారం హైకోర్టు సింగిల్ బెంచ్ రోజా సస్పెన్షన్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌ను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్... సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
 
దీనిపై వెంటనే సుప్రీం కోర్టు ఆశ్రయించాలని భావించిన రోజా.. ఆలస్యంగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రివిలేజ్ కమిటీ ముందుకు తనను పిలవకపోవడం దారుణమని సదరు పిటిషన్‌లో రోజా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సమస్యలపై పోరాడుతున్నందునే తనను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారని కూడా ఆమె ఆరోపించారు. 
 
తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏపీ సీఎం చంద్రబాబు జరుపుకోవడానికి అర్హత లేదని, తనకు పిల్లనిచ్చిన మామగారిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకునే నైతికత లేదన్నారు. అసెంబ్లీలో మైకు కూడా ఇవ్వకుండా ఎన్టీఆర్‌ను బయటికి వెళ్ళిపోయేలా చేసిన ఘటనల్ని ఇంకా తెలుగు ప్రజలు మరిచిపోలేదని రోజా గుర్తు చేశారు. ఏపీ సర్కాను ప్రజల సమస్యలపై నిలదీయడంతోనే తనపై సస్పెన్షన్ వేటు వేశారని దుయ్యబట్టారు.