చిన్నారులలో నైతికతను పెంపొందించటంలో ఉపాధ్యాయిలదే కీలక భూమిక: ఆంధ్రప్రదేశ్ గవర్నర్
విజయవాడ: చిన్నారులలో నైతికతను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. భావి భారత నిర్మాణంలో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు గొప్ప భూమికను పోషిస్తున్నారని, ఉపాధ్యాయులు రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి ఇతిహాసాలలోని నీతి, నైతికతలను విధ్యార్ధులకు బోధించాలని సూచించారు. శ్రీ పావని సేవా సమితి నేతృత్వంలో రూపుదిద్దుకున్న మహాభారతం, రామాయణం, భగవద్గీత పురాణ ఆధ్యాత్మిక పుస్తకాలను మాననీయ గవర్నర్ శనివారం రాజ్ భవన్ దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేసారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జీవిత సారాన్ని మనకు నేర్పించే భగవద్గీత భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల విశ్వవిద్యాలయాలలో కూడా పాఠ్యాంశాల్లో చేర్చబడిందన్నారు. స్వాతంత్ర్యానంతరం భారత దేశంలో రామ రాజ్యం రావాలని మహాత్మా గాంధీ కలలు కన్నారని, కాని రామాయణం అంటే ఏమిటో తెలియకుండా మనం రామ రాజ్యాన్ని ఎలా సాధించగలమని గవర్నర్ అన్నారు. మహాభారతంలో కర్ణుడి పాత్రపై అభిసప్తా కర్ణ అనే పేరుతో ఒడియాలో తాను ఒక పుస్తకం రాసానన్న హరిచందన్, శాంతి నికేతన్‌లో విభాగాధిపతిగా పనిచేసిన తన సోదరుడు డాక్టర్ నీలాద్ భూసన్ హరిచందన్ మహాభారత ఇతిహాసంపై అనేక పుస్తకాలు రాశారని ఆయన గుర్తు చేసుకున్నారు.
రామాయణం, మహాభారతం, భగవద్గీత మొదలైన ఇతిహాస పుస్తకాలను తీసుకురావడంలో శ్రీ పావని సేవా సమితి చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. విద్యార్ధులకు సులభంగా అర్థం అయ్యే రీతిలో వీటి రూపకల్పన జరిగిందని తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. వీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఉపాధ్యాయులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారని, పురాణ ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రచురించడంలో టిటిడి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని సుబ్బారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో చల్లా సాంబి రెడ్డి, పావని సేవా సమితి బాధ్యులు ఆచార్య ముత్యాల నాయుడు, వివిధ ఆధ్యాత్మిక సంస్థల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు ప్రముఖులు హాజరయ్యారు.