ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 4 సెప్టెంబరు 2019 (22:33 IST)

గురువు కూడా అంతే.... శిష్యుడిని సురక్షితంగా ఒడ్డున పడవేస్తాడు...

గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః 
గురుర్దేవో మహేశ్వరః
గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవే నమః
 
గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు ఆదిబ్రహ్మ అటువంటి గురుదేవులకు నమస్కరిస్తున్నాను. కొండ మీద బావి తవ్వినట్లయితే..... వందల కొద్ది అడుగులు తవ్వినా నీళ్లు పడకపోవచ్చు. ఏటి ప్రక్కన ఒకట్రెండు అడుగులు తవ్వగానే జలధార పొంగుకు రావచ్చు. అలానే గురువు సమక్షంలో మనలోని సద్గుణాలు నైపుణ్యాలు త్వరగా బయటకు వస్తాయి.
 
పాలల్లో ఎన్ని పాలు పోసినా తోడుకోదు. చిటికెడు పెరుగు కలిపితేనే తోడుకుంటుంది. గురువు కూడా ఆ పెరుగు లాంటి వాడే. మన జీవితానికి ఒక అర్దాన్ని ప్రసాదిస్తాడు. శిష్యుడిని సన్మార్గంలో పెట్టడానికి, సద్గురువుకు కొన్నిసార్లు కఠినంగానూ వ్యవహరిస్తారు. గురుదృష్టి కూర్మదృష్టి లాంటిది. తాబేలు ఓ చోట గుడ్లు పెట్టి తన దారిన తాను వెళ్లిపోతుందట. కానీ, బలమైన అంతర్ దృష్టిలో..... అక్కడెక్కడో ఉన్న గుడ్లను పిల్లలను పొదిగేస్తుందట. సద్గురువూ అంతే. శిష్యుడు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా గురువుకు మనసంతా శిష్యుడి మీదే ఉంటుంది.
 
గురుశిష్య సంబంధానికి తొలిదశలో మర్కటకిశోర న్యాయం వర్తిస్తుంది. పిల్లకోతి తల్లికోతిని గట్టిగా పట్టుకుంటుంది. కొండలు దాటుతున్నా, గుట్టలు దాటుతున్నా ఆ పట్టు వదలదు. శిష్యడు కూడా గురువును అంతే బలంగా విశ్వసించాలి. మలిదశలో మర్జాలకిశోర న్యాయం వర్తిస్తుంది. పిల్లి తన పిల్లలను ఎలాంటి గాయాలు కాకుండా....... చాలా జాగ్రత్తగా తన పళ్లతో పట్టుకుని రకరకాల గమ్యాలకు తరలిస్తుంది. గురువు కూడా అంతే.... శిష్యుడిని సురక్షితంగా ఒడ్డున పడవేస్తాడు.