శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 18 మే 2021 (20:17 IST)

కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారుల పేరున రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్: అనిల్ సింఘాల్

అమరావతి: కరోనాతో మృతి చెందిన వారి పిల్లలకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన ప్రతి చిన్నారి పేరున రూ.10 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు.

రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూ సత్ఫలితాలిస్తోందని, కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడమే దీనికి నిదర్శమని తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో రోజుకు 50 వేల మందికి టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా వైద్య సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గడిచిన 24 గంటల్లో 73,749 కరోనా టెస్టులు నిర్వహించగా, 18,561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 109 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,421 ఐసీయూ బెడ్లు, ఉండగా, వాటిలో 6,058 రోగులతో నిండి ఉన్నాయన్నారు. ఆక్సిజన్ బెడ్లు 23,393 ఉండగా, 22,960 బెడ్లు రోగులతో నిండి ఉన్నాయన్నారు. గడిచిన 24 గంటల్లో 4,551 మంది డిశ్చార్జి కాగా, 6,884 మంది కరోనాతో పలు ఆసుపత్రుల్లో చేరారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లలో 17,340 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాసుపత్రులకు 22,882 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందజేశామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు 19,746 ఇంజక్షన్లు సరఫరా చేశామన్నారు. గడిచిన 24 గంటల్లో 600 టన్నుల ఆక్సిజన్ ను రాష్ట్ర అవసరాలకు వినియోగించామన్నారు. ఆక్సిజన్ వృథా నివారణకు నేవీ బృందాలు చేసిన కృషిని అభినందిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

పాజిటివ్ వచ్చిన కేసులకు వెంటనే ఎస్ఎంఎస్ లు అందిస్తున్నామన్నారు. నెగిటివ్, పాజిటివ్ రిపోర్టులను తక్షణమే అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా ఫలితాలనను త్వరగా అందించడానికి వార్డు, గ్రామ సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లను వినియోగించుకుంటున్నామన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో ప్రస్తుతం 17,400 బెడ్లు ఉన్నాయని, వారాంతానికి 20 వేలు దాటుతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 సెంటర్లలో శుక్రవారం, శనివారాల్లో మరిన్ని బెడ్లు రానున్నాయన్నారు.
 
50 వేల మందికిపైగా టెలీ సేవలు అందించే దిశగా చర్యలు...
రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 104 కాల్ సెంటర్ కు 12,926 ఫోన్లు రాగా, వివిధ సమాచారాల కోసం 5,351 కాల్స్ వచ్చాయన్నారు. టెస్టులకు 2,790, అడ్మిషన్లకు 2,590, టెస్టు రిజల్ట్ కు 1,720 ఫోన్లు వచ్చాయన్నారు. టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా 3991 మంది వైద్యులు హోం ఐసోలేషన్లో ఉన్న24,375వేల మందికిపైగా కరోనా బాధితులకు ఫోన్ చేసి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారన్నారు.

ముఖ్యంగా హోం ఐసోలేషన్లలో ఉన్నవారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు, రోజుకు 9 వేల నుంచి 24 వేల వరకూ ఫోన్ కాల్స్ చేసే సంఖ్య పెరిగిందన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా రోజుకు 50 వేల మందికి ఫోన్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు 2,10,436 ఉండగా, 38,492 మంది ఆసుపత్రుల్లో, 17, 417 మంది కొవడ్ కేర్ సెంటర్లలో, 1,54,527 మంది హోం ఐసోలేషన్లో వైద్యం సేవలు పొందుతున్నారన్నారు.  
 
కర్ఫ్యూతో కేసులు తగ్గుముఖం...
కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విధించిన కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పెంచుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారన్నారు. కరోనా నియంత్రణకు విధించిన కర్ఫ్యూ సత్ఫలితాలు ఇస్తోందన్నారు. కొన్ని జిల్లాల్లో కేసులు తక్కువ సంఖ్యలో నమోదయ్యారన్నారు. ఈనెల 31వ తేదీ వరకూ కర్ఫ్యూ పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల కేసులు మరింత తగ్గుముఖం పట్టడం ఖాయమన్నారు.
 
అనాథ పిల్లలకు అండగా...
కరోనా కారణంగా మృతిచెందిన వారి పిల్లలకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు మృతి చెంది అనాథలుగా మారిన చిన్నారుల పేరున రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలను ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఫిక్స్ డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీని అనాథ పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకూ అందజేయనున్నామన్నారు. ఆ తరవాత ఫిక్స్ డ్ డిపాజిట్ ను వారి అవసరాలకు అనుగుణంగా  వినియోగించుకునేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో ఉత్వర్లు జారీచేయనున్నామన్నారు.
 
ఆరోగ్య శ్రీ కింద బ్లాక్ ఫంగస్ చిక్సితలు...
రాష్ట్రంలో 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతి టీచింగ్ ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ వైద్య సేవలు అందిచేలా ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. బ్లాక్ ఫంగస్ తో రాష్ట్రంలో ఎక్కడా మరణాలు సంభవించినట్లు సమాచారం లేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ బ్లాక్ ఫంగస్ చికిత్సలను ఆరోగ్య శ్రీ కింద చేర్చామన్నారు. అదే సమయంలో బ్లాక్ ఫంగస్ నివారణకు అవసరమైన మందులు, ఇంజక్షన్ల కొనుగోలుకు టెండర్లు పిలవాలని సీనియర్ అధికారుల కమిటీ నిర్ణయించిందన్నారు.

మధుమేహం తీవ్రంగా ఉన్నవారిలో బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని, సరైన సమయంలో గుర్తిస్తే ఆ వ్యాధిని సులభంగా నివారించొచ్చునని నిపుణులు తెలిపారన్నారు. బ్లాక్ ఫంగస్ పై చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బ్లాక్ ఫంగస్ గుర్తించిన వెంటనే ప్రైవేటు ఆసుపత్రులు తక్షణమే ప్రభుత్వానికి సమాచారమివ్వాలని ఆదేశించనున్నామన్నారు. అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్...  ఇందుకుగానూ నోటిఫికేషన్ ను నేడో రేపో జారీచేస్తామన్నారు. ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.
 
3 రోజుల్లో 91 వేల మంది జ్వరపీడుతుల గుర్తింపు ...
రాష్ట్రంలో మూడు రోజుల నుంచి ఫీవర్ సర్వే సాగుతోందని తెలిపారు. నేటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 91 వేల మంది జ్వరపీడుతులను గుర్తించామన్నారు. జ్వరపీడితులకు టెస్టుల చేయడంతో పాటు హోం ఐసోలేషన్లు కిట్లు ఇస్తామన్నారు. ప్రతి ఒక్క కేసు గురించి క్షుణ్నంగా ఆరా తీస్తున్నామన్నారు. అంబులెన్స్ లు అందుబాటులో పెట్టి, అవసరమైన వారిని ఆసుపత్రుల్లో చేర్చాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. 
 
గతేడాది మాదిరిగానే వైద్య సిబ్బంది నియామకం...
రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది మాదిరిగానే ఈ ఏడాది వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. స్పెషలిస్టులను గతేడాది 148 మందిని తీసుకుంటే ఈ ఏడాది 108 మందిని నియమించిన‌ట్లు తెలిపారు. జీడీఎంలు గతేడాది 2,524 మందిని తీసుకుంటే ఈ ఏడాది 3,025 మందిని నియమించామన్నారు. స్టాఫ్ నర్సులన 5225 మందిని గతేడాదికి రిక్రూట్ చేసుకుంటే, ఈ ఏడాది 5,493 మందిని తీసుకున్నామన్నారు.

ఎఫ్ఎన్ఓ, ఎంఎన్వో లను గతేడాది 4,320 తీసుకుంటే, ఈ ఏడాది 4,144 మందిని నియమించామన్నారు. గతేడాది 17,315 మందిని నియమిస్తే... ఈ ఏడాది 17,901 మందిని తీసుకున్నామన్నారు. అవసరమైతే ఇంకా తీసుకోవాలని కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించామన్నారు. గడిచిన ఏడాది కాలంలో 9,700 మందిని శాశ్వత ప్రాతిపదికన నియమించామన్నారు. రాష్ట్రంలో స్పెషలిస్టు వైద్యుల కొరత లేదన్నారు. 2068 పీజీ విద్యార్థులను, 2467 మంది హౌస్ సర్జన్లను, 676 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను, 2061 నర్సింగ్ విద్యార్థులను, 381 డెంటల్ విద్యార్థులను కొవిడ్ సేవలకు వినియోగించాలని నిర్ణయించామన్నారు.