శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (07:51 IST)

ఒక ప్రాంతం నుంచే పాలన... అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి: జనసేన

రాజు మారినప్పుడల్లా రాజధాని మారిస్తే ... ప్రజలే రాజును మార్చే రోజు దగ్గర్లోనే వస్తుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పాలన ఒక ప్రాంతంలో ఉండాలి... అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరగాలన్నదే జనసేన పార్టీ విధానమని స్పష్టం చేశారు.

రాజధానిగా అమరావతిని వద్దనుకొంటే.. విశాఖపట్నానికి మారుస్తారా..? లేక కర్నూలుకు తీసుకెళ్తారా..? అనేది ధైర్యంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.  సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్, నాదెండ్ల మనోహర్, పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, ప్రధాన కార్యదర్శులు, టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, పీఏసీ సభ్యులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఈ విస్తృత సమావేశంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులు, అమరావతి గ్రామాల ప్రజలు - రైతుల ఆందోళన, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆశలు – ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత పై చర్చించారు. 
 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “అమరావతి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందాలని కలలు కన్నవారిలో నేను ఒకడిని. కానీ రాజధాని దినదినం అథోగతి పాలవుతోంది.  రాజధానిపై ఈ రోజుకి వైసీపీ ప్రభుత్వానికి స్పష్టత లేదు. జి.ఎన్.రావు కమిటీ చెప్పింది వెనుకబడిన విజయనగరం ప్రాంతంలో రాజధాని పెట్టమని వైజాగ్ లో కాదు. కమిటీ సిఫార్సునే ప్రభుత్వం అమలు చేయలేదు. 
 
ప్రభుత్వం ధర్మం తప్పింది 
జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కే ముఖ్యమంత్రా..? లేక కొన్ని ప్రాంతాలకు మాత్రమే ముఖ్యమంత్రా..?.  ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికి, విషాన్ని వెదజల్లడానికేనా 151 మందిని గెలిపించింది. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేదు కనుకే రాజధానిగా అమరావతిని అంగీకరిస్తున్నామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ ఆ రోజు ఒప్పుకున్నారు. కనుకే రైతులు భూములు ఇచ్చారు.

ఆ రోజే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొస్తే రైతులు భూములు ఇచ్చేవారు కాదు కదా. వ్యక్తులు మారినప్పుడల్లా విధానాలు మార్చడం సబబు కాదు. 27 వేల రైతు కుటుంబాలు, దాదాపు లక్షమంది ప్రజలతో ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తోంది. రైతుతో  కన్నీరు పెట్టించిన ప్రభుత్వం మనుగడ సాధించినట్లు చరిత్రలో లేదు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగితే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి కానీ రాజధానినే మార్చేస్తారా..? ప్రభుత్వం ధర్మం తప్పింది.  వ్యవస్థలు నడిపించే వ్యక్తులే మాట మార్చితే ఎలా..? కడుపు మండిన వ్యక్తి ఏ స్థాయికి వెళ్తాడో ఊహించుకోండి.   

వారి భూములు వారి చేతుల్లో లేవు 
ఉత్తరాంధ్రపై ప్రేమ ఉన్నట్లు వైసీపీ నాయకులు నటిస్తున్నారు. 2018 అక్టోబర్ లో తిత్లీ తుపాన్ వచ్చి వేల ఎకరాల్లో పంట నష్టపోతే ఈ నాయకులు ఎక్కడికి పోయారు. పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత పక్క జిల్లా విజయనగరంలో ఉన్నా కూడా శ్రీకాకుళం రైతులను పరామర్శించడానికి రాలేదు. ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలతో వేలాది మంది చనిపోతుంటే పట్టించుకోలేదు.

ఇప్పుడు సడన్ గా ఉత్తరాంధ్ర భవిష్యత్తు, వెనుకబాటు తనం అని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క పెన్నుపోటుతో ఉత్తరాంధ్రకు చెందిన కొన్ని వర్గాలకు రిజర్వేషన్ తొలగిస్తే జగన్ రెడ్డి గారు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు తమను తమ ప్రాంతానికే  బదిలీ చేయాలని వేడుకుంటుంటే ఎందుకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు? 

విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందంటే సంతోషం కంటే చాలా మందిలో భయం నెలకొంది. కారణం వారి భూములు వారి చేతుల్లో లేవు.  ఇప్పుడు సడన్ గా వైజాగ్ పై ప్రేమ రావడానికి కూడా అక్కడ భూములు మీద మమకారం తప్ప వైజాగ్ ప్రజల మీద కాదు.

హైకోర్టు మార్పు ప్రకటన మోసపూరితమే
హైకోర్టును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. అయితే అలా మార్చే అధికారం తనకే ఉందన్న భ్రమతో ముఖ్యమంత్రి కర్నూలుని జ్యుడీషియల్ క్యాపిటల్ గా మారుస్తానని ప్రకటించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అమరావతిలో ఏర్పడ్డ హైకోర్టును కర్నూలుకు మారుస్తామని ప్రకటించడం ఆ ప్రాంత ప్రజలను మోసం చేయడమే.

స్వలాభం కోసం ప్రాంతాల వారీగా ప్రజల్లో ఆశలు రేపి, వారి మధ్య ప్రాంతీయ వైషమ్యాలకు బీజం వేయడం శ్రేయస్కరం కాదు. దీనిపై వైసీపీ నాయకులు స్పష్టత ఇవ్వాలి. నిజంగా రాయలసీమ ప్రాంతంపై ప్రేమ ఉంటే పరిశ్రమలు స్థాపించండి. యువత వలసలు పోకుండా నిరోదించండి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు కాదు. వెనక్కి నెట్టబడిన ప్రాంతాలు.

ఇప్పటి వరకు ఆ ప్రాంతం నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులు వచ్చినా ఇప్పటికీ వెనకబడి ఉండటానికి కారణం ఎవరు..?. కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ప్రధాని ఎందుకు రాలేదు.

స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే మూడు రాజధానుల చిచ్చు
ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇసుక సరఫరాలో వైఫల్యం, తెలుగు మాధ్యమం  రద్దు, ఉల్లి కొరత,  పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు,  క్షీణిస్తున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లాంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడీషియల్ క్యాపిటల్ అనే ప్రకటనను ఈ ప్రభుత్వం చేసింది.

విశాఖపట్నం, కర్నూలు ప్రాంతాలపై ప్రేమతో కాదు. మూడు రాజధానుల ఆలోచనతో మూడు ప్రాంతాల్లో చిచ్చుపెట్టి స్థానిక ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు. దానిని నిలిపివేస్తే చాలా పెద్ద స్థాయిలో సమాధానం చెప్పాల్సి వస్తుంది.

రైతుల కోసం ప్రాణాలైనా అడ్డుపెడతాం
జనసేన పార్టీ రైతు పక్షపాతి. రాజధాని ప్రాంత రైతులు భూములు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తప్ప ఒక పార్టీకి కాదు. రాజధాని కోసం తల్లి లాంటి భూములు ఇచ్చి త్యాగాలు చేస్తే ప్రభుత్వం వారిని అవహేళన చేస్తుంది. ఇవాళ మహిళలు, పిల్లలు, వృద్ధులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు.

జనసేన పార్టీ అమరావతి రైతులకు అండగా ఉంటుంది. వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తే ప్రాణాలైన అడ్డుపెట్టి కాపాడుకుంటుంది. అలాగే పోలీసు అధికారులకు కూడా మేము విన్నవించుకుంటున్నాం. వైసీపీ నాయకుల మాటలు విని అమాయక రైతులపై కేసులు పెట్టొద్దు. ఎవరైన మోసం చేస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటాం. ప్రభుత్వమే మోసం చేస్తే ఎక్కడికి వెళ్తాం.

అమరావతి రైతులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం రాజధాని మార్చాలని చూస్తే ప్రభుత్వం గడ్డు పరిస్థితులు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి ముఖ్య నాయకులు,  పొలిటికల్ బ్యూరో సభ్యులు, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, ప్రధాన అధికార ప్రతినిధులు, అధికార ప్రతినిధులు, నియోజకవర్గ ఇంచార్జులు హాజరయ్యారు.
 
15 ఏళ్ల పాటు మంత్రిగా మీరేం చేశారు?: నాదెండ్ల మనోహర్
రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “స్వార్ధపూరితంగా తీసుకునే నిర్ణయాలు ప్రజలకు శ్రేయస్కరం కాదు. మనం తీసుకునే నిర్ణయాలు ఎక్కువ మందికి నచ్చినా కొంత మంది వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఎవరు తీసుకునే నిర్ణయం అయినా అభివృద్ధి అనేది ఒక బాధ్యతగా ఉండాలి. రాజకీయ పార్టీగా ఒక బాధ్యతగా పని చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా మనందరి మీదా ఉంటుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి మాట్లాడగలిగేది ఒక జనసేన పార్టీ మాత్రమే అన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగాం. అది మన నాయకుడి మీద ఉన్న నమ్మకం. గత ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దు, వారు ఇస్తేనే తీసుకోవాలని బలంగా చెప్పారు. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేసి హైకోర్టు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ ల క్వార్టర్స్ నిర్మించారు.

ఇప్పుడు రాజధాని కాదు అంటే రైతులు రోడ్డెక్కాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో రైతుల తరఫున మొదట పర్యటన చేసింది జనసేన పార్టీనే. అక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు అని అక్కడ ప్రజలు అడుగుతున్నారు. ఆయన వస్తే ప్రభుత్వాలు స్పందిస్తాయన్న నమ్మకం ప్రజల్లో ఉంది. 

రాజకీయాల్లో ఆది నుంచి వెనుకబడిన ప్రాంతాల పేరు చెప్పి పదవులు తెచ్చుకోవడం మినహా నాయకులు ఆ ప్రాంతాలకు మేలు చేసింది లేదు. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు 25 సంవత్సరాలకు పైగా రాష్ట్రాన్ని పాలించారు. ఇప్పటికీ పరిస్థితులు మారలేదు. ఉత్తరాంధ్రలో సమస్యలు ఈనాటివి కాదు. రాజధాని హైదరాబాద్ నగరానికి అనుకుని ఉండే నల్గొండ జిల్లా నుంచి ఎప్పుడూ ముగ్గురు మంత్రులు ప్రభుత్వంలో ఉండేవారు.

జిల్లా ప్రజలు ఫ్లోరొసిస్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఎందుకు పట్టించు కోలేదు. అవన్నీ ఉద్దేశపూర్వకంగా ప్రజల జీవితాలతో ఆటలాడడమే. ఒక నిర్ణయం ఒక ప్రాంతానికే మంచి చేస్తుంది అంటే అది మంచిది కాదు. మాట్లాడితే 70 ఏళ్లుగా గంజి తాగుతున్నాం మా ప్రాంతానికి మేలు జరుగుతుంటే అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. ఆ మాట్లాడే వారు 15 ఏళ్ల పాటు మంత్రిగా ఏం చేశారు?” అని ప్రశ్నించారు.