ప్రజలకు టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. విధ్వంసానికి, వికృత చర్యలకు జగన్ 6 నెలల పాలనే కేరాఫ్ అడ్రస్‌గా ఉందన్నారు. దేవాలయాలను కూల్చేస్తున్నారు, వక్ఫ్‌భూములను ఆక్రమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత సామాజిక వర్గానికే జగన్ ప్రాధాన్యతనిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. జగన్ తీరుతో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయన్నారు. సౌకర్యాల పేరుతో జగన్ సొంతింటికి రూ. 17కోట్ల ప్రజా ధనం వాడుకున్నారని ఆరోపించారు. వైసీపీ రంగుల కార్యక్రమానికి రూ. 1300 కోట్లు దుర్వినియోగం చేశారని చెప్పారు.
లేఖ యధాతధంగా...
విశ్వాసఘాతానికి, విధ్వంసానికి, వికృత చర్యలకు జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పాలన కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. గత ఆరు నెలల నుండి మీరు పడ్డ కష్టాలను, నష్టాలను ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాము.
1. కులచిచ్చు: కులాలు, మతాలు, ప్రాంతాలను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. వైకాపా నాయకులు మనలో నెలకొని ఉన్న ఐకమత్యానికి తూట్లు పొడుస్తూ హిందూ, ముస్లీం, క్రిస్టియన్ల మధ్య బేధాభిప్రాయాలను లేవనెత్తారు. అధికారం చేతులో ఉంది కదా అని రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరిలా మార్చారు.
దశాబ్ధాలుగా వస్తున్న సాంప్రదాయాలకు ముఖ్యమంత్రి తిలోదకాలు పలికారు. కలియుగ దైవంపై మంత్రులు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. దేవాలయాలను కూల్చివేస్తున్నారు. వైకాపా నాయకులు వక్స్ భూములను ఆక్రమిస్తున్నారు. ఇంత వరకు వక్ఫ్ కమిటీకి ఒక్క రూపాయి కేటాయించకపోవడం మైనార్టీలను అవమాన పరచడమే అవుతుంది. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత క్రిస్టియన్లను రాజకీయంగా, సామాజికంగా ఎక్కడా ఆదుకున్న పాపానా పోలేదు.
2. సామాజిక న్యాయం పేరుతో ద్రోహం : వివిధ నిబంధనల పేరుతో అందరిలో కులాల కుంపట్లు పెట్టారు. ఉత్సవ విగ్రహాల్లా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు తప్ప ఎక్కడా బడుగు, బలహీన వర్గాలను ఆదుకున్న పాపానా పోలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కులాలు, మతాలకు అతీతంగా అందరికి అధికారాన్ని కట్టబెట్టారు. కాని నేడు జగన్ తన సామాజిక వర్గానికే సింహ భాగం అధికారం ఇచ్చుకున్నారు. ఇందులో సామాజిక న్యాయం ఎక్కడుంది?
3. అమరావతి: ప్రపంచ స్థాయి రాజధాని లక్ష్యంగా అమరావతికి తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే.. వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలు, అబద్ధాలు, దుష్ప్రచారాలతో పెట్టుబడులు, రుణాలు తరలిపోయే దుస్థితికి తీసుకొచ్చారు. ఆదాయం తీసుకొచ్చే రాజధానిపై అభాండాలు వేసి అప్రతిష్టపాలు చేశారు. కాస్మొపాలిటన్ సిటీకి కులం, మతం ముద్ర వేసి కుతంత్రాలు చేశారు.
4. దుబారా ప్రభుత్వం: అధికారంలోకి వచ్చీ రాగానే ప్రజావేదిక కూల్చి రూ.9 కోట్ల ప్రజాధనం నేలపాలు చేశారు. కాని జగన్ సొంత ఇంటి సౌకర్యాల పేరుతో రూ.17 కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేశారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడానికి రూ.1,300 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు.
పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలు చేయకుండా కార్యకర్తల ఉపాధి కోసం ఏడాదికి రూ.7,500 కోట్లు ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారు. కేంద్రం వద్దని వారించినా వినకుండా పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి రూ.7,500 కోట్లు నష్టం కలిగించారు. కేంద్ర విద్యుత్ శాఖ మరియు కోర్టులు వద్దన్నా.. విద్యుత్ పీపీఏలను రద్దు చేసి రూ.4.84 పైసలకు వచ్చే యూనిట్ సౌర విద్యుత్‌ను కాదని.. రూ.11.68 పైసలకు కర్ణాటక నుంచి విద్యుత్ కొంటూ తమ వారికి దోచిపెడుతున్నారు.
5. ఇసుక మాఫియా: ఉచితంగా అందుతున్న ఇసుకను.. తమ వారి జేబులు నింపడం కోసం రద్దు చేసి.. సామాన్యులు ఇసుక అంటేనే బెంబేలెత్తే స్థాయికి ఇసుక మాఫియాను ప్రోత్సహించారు. భవన నిర్మాణ రంగాన్ని కుప్పకూల్చి.. 125 వృత్తులు, వ్యాపారాలను దెబ్బకొట్టారు. సిమెంటు కంపెనీల నుండి రూ.2,500 కోట్ల జె-ట్యాక్స్ వసూలు కోసం ఇసుక కొరత సృష్టించి 60 మందికి పైగా కార్మికుల ప్రాణాలను బలిగొన్నారు.
6. అయోమయంలో పోలవరం భవిష్యత్: పీపీఏ వద్దన్నా, నిబంధనలకు విరుద్ధంగా రివర్స్ టెండరింగ్‌కు పాల్పడి రూ.8వేల కోట్ల మేర నష్టానికి జగన్ ప్రభుత్వం పాల్పడింది. రెండేళ్లలో పూర్తి కావాల్సిన పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టును తమ వారికి కట్టబెట్టడం కోసం.. ఐదేళ్లు వ్యవధి నిర్ధేశించారు. దీంతో కోర్టు లిటిగేషన్ పాలైంది.
7. పారిశ్రామికీకరణకు గొడ్డలిపెట్టు: వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి.
8. ఉద్యోగుల తొలగింపు: వైసీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకు ఏళ్ల తరబడి సేవలందిస్తున్న వేలాది మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నిర్ధాక్షిణ్యంగా విధుల్లోంచి తొలగించి వారి పొట్టకొట్టారు.
9. ధరల పెంపు: వికృత ధోరణితో ఇష్టానుసారంగా ధరలను పెంచుతూ సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు భారాన్ని పెంచారు. సిమెంట్ బస్తాపైన రూ.110 పెంచారు. రూ.10వేలు కూడా లేని లారీ ఇసుక రూ.50వేలకు చేరింది. మద్యం ధర రెట్టింపు అయింది. కిలో ఉల్లి రూ.100 దాటింది. ఈ కృత్రిమ కొరత ఏపీలోనే ఎందుకు?
10. జే టాక్స్ కోసం అవినీతి: సిమెంట్ కంపెనీల నుంచి రూ.2,500 కోట్ల జే-ట్యాక్స్ కోసం కృత్రిమ ఇసుక కొరత సృష్టించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో.. ముడుపులు ఇచ్చిన కంపెనీల బ్రాండ్స్ మాత్రమే అందుబాటులో ఉంచారు. ఉచితంగా దొరికే ఇసుకకూ ధర నిర్ణయించి రూ.వేల కోట్లు దోచుకున్నారు. గ్రామ సచివాలయ పరీక్షా పేపర్లు లీక్ చేసి జేబులు నింపుకున్నారు.
11. మిషన్ బిల్డ్ కాదు.. సోల్డ్ ఆంధ్రప్రదేశ్ : తక్కువ ధరకే విలువైన ప్రభుత్వ భూములు కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. విజయవాడ నడిబొడ్డున ఉండే రూ.1000 కోట్ల విలువైన స్టేట్ గెస్ట్‌హౌస్‌ను రూ.200 కోట్లకు వైసీపీ నేతలకు కట్టబెట్టేందుకు ప్లాన్ చేశారు. ప్రభుత్వం అన్నాక ఆస్తులు సృష్టించుకోవాల్సింది పోయి.. ఉన్న ఆస్తులు అమ్ముకోవడం అవినీతి కాదా.?
12. అవ్వా, తాతలకు అన్యాయం: పింఛన్లు పెంచుతామన్న మాటపై మడమ తిప్పింది వాస్తవం కాదా? నెలకు రూ. 3000 ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి.. అధికారంలోకి వచ్చాక ఏటా రూ.250 మాత్రమే పెంచుతామని మాట మార్చడం వంచన కాదా..?
13. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని మాటిచ్చి.. మాట తప్పారు. లక్షలాది మంది మహిళలను నిలువునా మోసం చేశారు.
14. కుటుంబంలో ఎంత మంది ఉన్నా.. అందరికీ 'అమ్మ ఒడి' అని హామీ ఇచ్చి వివిధ రకాల నిబంధనలతో అర్హులను కుదించి తల్లులందరికి అన్యాయం చేస్తున్నారు.
15. సెప్టెంబర్ నుంచి 'సన్న బియ్యం' అన్నారు. తర్వాత నాణ్యమైన బియ్యం అన్నారు. చివరికి ముక్కిన, గడ్డలు కట్టిన బియ్యం ఇచ్చి బడుగుల కడుపుకొట్టారు.
16. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు 50% రిజర్వేషన్ అని హామీ, జీవో ఇచ్చి.. కీలకమైన పదవుల్లో 82 పదవులు సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టారు. ఇక్కడ రిజర్వేషన్ ఎందుకు అమలు కాలేదో సమాధానం చెప్పేవారే లేరు. టీటీడీ జంబో బోర్డులో 36 సభ్యులను నియమించినా ఎస్సీ ఎస్టీలకు 50% రిజర్వేషన్ అమలు చేయకుండా దగా చేశారు.
17. విత్తనాల సరఫరాలో వైఫల్యం, కరెంట్ కోతలు, వరద నియంత్రణలో వైఫల్యం, పెట్టుబడి సాయం అందించడంలో వైఫల్యం కారణంగా ఆరు నెలల్లో 286 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
18. గ్రామాల్లో విధ్వంసకాండ సృష్టించి తెలుగుదేశం శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. 8 మందిని పొట్టపెట్టుకున్నారు. 600పైగా దాడులకు పాల్పడ్డారు. ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయే దుస్థితి కల్పించారంటే.. వైసీపీ నేతల వికృత చేష్టల పరాకాష్ట ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
19. నిత్యం మూడు లక్షల మంది అన్నార్తుల ఆకలి తీర్చే 'అన్న క్యాంటీన్ల'ను మూసివేసి పస్తులుండేలా చేస్తున్నారు.
20. ప్రశ్నించే వారే ఉండకూడదంటూ.. పత్రికా విలేకర్లపై దాడులకు తెగపడ్డారు. మీడియా గొంతు నొక్కడానికి 2430 నల్ల జీవోను తీసుకొచ్చారు. నోరెత్తితే అరెస్టు చేస్తామంటూ ప్రజాస్వామ్య స్పూర్తినే హత్య చేసేలా వ్యవహరించారు.
21. కాపులకు తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్‌ని రద్దు చేశారు. కాపు కార్పొరేషన్ రుణాల దరఖాస్తులను నిలిపేసి వెన్నుపోటు పొడిచారు.
22. 6 నెలల్లో వచ్చిన ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు కులం, మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు.
23. తెలుగు, ఆంగ్ల భాషలను ఎంచుకునే సదుపాయం విద్యార్ధులకు, తల్లిదండ్రులకు ఇవ్వకుండా కావాలని విద్యార్ధులపై ఆంగ్ల భాషను రుద్ది తెలుగు భాషకు తూట్లు పొడుస్తుంది.
24. జగన్ ప్రభుత్వం తుచ్చమైన తిట్ల భాషను ప్రత్యర్ధులపై విసురుతూ మనకు కొత్త సాంప్రదాయాన్ని నేర్పుతున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్, మంత్రుల నోటి నుంచి రోత పుట్టించే భాష మాట్లాడిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.