శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 17 జులై 2021 (17:33 IST)

మాన‌వాళి యోగక్షేమాల కోస‌మే యాగాలు: అగ‌స్య పీఠాధిప‌తి సుగుణానంద స్వామి

ఆధ్యాత్మిక చింత‌న‌తోనే మ‌నిషికి ప్ర‌శాంత‌త ల‌భిస్తుంద‌ని, వ్య‌క్తి త‌న‌ను తాను నియంత్రించుకునేందుకు ధ్యాన‌మే ఏకైక మార్గమ‌ని అగ‌స్య పీఠాధిప‌తి సుగుణానంద స్వామి అన్నారు. మాన‌వాళి యోగ‌క్షేమాల కోస‌మే యాగాలు చేస్తున్నామ‌న్నారు.

కృష్ణా జిల్లా వీరుల‌పాడు మండ‌లం జుజ్జూరులో అగ‌స్య పీఠంలో  సుగుణానంద స్వామి జ‌ర్న‌లిస్టుల‌కు బియ్యం, నిత్యావ‌స‌రాలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ స‌మ‌యంలో వృత్తిలో నిమ‌గ్న‌మై, కుటుంబాల‌ను సైతం త్యాగం చేస్తున్న జ‌ర్న‌లిస్టుల‌కు ఆయ‌న బాస‌ట‌గా నిలిచారు. ఈ సంద‌ర్భంగా స్వామిజీ మాట్లాడుతూ, అగ‌స్య పీఠాశ్ర‌మంలో ఆధ్యాత్మికత‌తో పాటు సేవా కార్య‌క్ర‌మాల‌కు కూడా ప్రాధాన్యం  ఇస్తున్నామ‌న్నారు. దేశంలో ఎక్క‌డా జ‌రుగ‌న‌టు వంటి మ‌హాయాగం అగ‌స్య పీఠాశ్ర‌మంలో త్వ‌ర‌లో నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

జ‌ర్న‌లిస్ట్‌ల‌కు బియ్యం, నిత్యావ‌స‌రాలు పంపిణీ కార్య‌క్ర‌మానికి  స్వామీజి ఆహ్వానంతో, ముఖ్య అతిధిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ్రాడ్‌కాస్ట్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు  ప‌ఠాన్ మీరాహుస్సేన్ ఖాన్ హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తోపాటు కంచిక‌చ‌ర్ల మార్కెట్ యార్డు మాజీ ఛైర్మ‌న్ బొమ్మిశెట్టి భాస్క‌ర‌రావు, న‌రసింహారావు పాలెం స‌ర్పంచి దుర్గాదేవి, జ‌ర్న‌లిస్ట్ సంఘ జిల్లా నాయ‌కులు ఏవి నారాయ‌ణ‌ పాల్గొని విలేఖ‌రుల‌కు స్వామిజితో క‌లిసి నిత్యావ‌స‌రాలు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా గ్రామీణ జ‌ర్న‌లిస్ట్‌ల సంఘం క‌న్వీన‌ర్ షేక్ లాల్ అహ్మ‌ద్ గౌస్ అధ్య‌క్ష‌త‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.
 
ఈ సంద‌ర్భంగా జ‌ర్న‌లిస్టు సంఘం నాయ‌కుడు మీరాహుస్సేన్ మాట్లాడుతూ, క‌ష్ట‌కాలంలో విలేఖ‌రుల‌కు చేయూత‌నిస్తూ, నిత్యావ‌స‌ర వ‌స్తువులు, బియ్యం పంపిణీ చేసిన సుగుణానంద‌ స్వామికి జ‌ర్న‌లిస్టుల  త‌రుపున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. బొమ్మిశెట్టి భాస్క‌ర‌రావు మాట్లాడుతూ, స్వామీజి ఎంతో నిష్ట‌తో ఆశ్ర‌మం నిర్వ‌హించ‌డం జుజ్జూరు వాసుల‌కు, న‌ర‌సింహారావు పాలెం గ్రామ‌స్థుల‌కు వ‌రం అన్నారు.

గ్రామ స‌ర్పంచి దుర్గాదేవి మాట్లాడుతూ, సుగుణానంద స్వామి త‌న ధ్యానం కోసం అగ‌స్య‌పీఠం ఏర్పాటు చేసుకుని నివాసం ఉండ‌డం ఈ ప్రాంతానికే ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవ‌డం మ‌నంద‌రి బాధ్య‌త అని వివ‌రించారు. అనంత‌రం వీరుల‌పాడు మండ‌ల విలేఖ‌రులు స్వామివారిని శాలువాల‌తో స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌ర్న‌లిస్ట్ సంఘ నాయ‌కులు ప‌ఠాన్ సైదాఖాన్‌, ఐల‌పోగు ర‌వి, వెంక‌ట్‌, వీరుల‌పాడు ప్రెస్‌క్ల‌బ్ అధ్య‌క్షుడు మాతంగి పుల్లారావు, విలేఖ‌రులు శ్రీ‌నివాస‌రావు, న‌రేంద్ర‌భూప‌తి, మ‌హేష్‌, సునీల్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.