బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (09:00 IST)

హెలికాఫ్టర్ మృతుల్లో తెలుగు వాసి... సాయితేజ స్వగ్రామం రేగడలో విషాదం..

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి అటవీప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన అర్థాంగి మధులికా రావత్‌ సహా 13 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో రావత్ వ్యక్తిగత సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉన్న చిత్తూరు జిల్లా వాసి సాయితేజ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలోనే సాయితేజ కూడా మృత్యువాతపడ్డారు. 
 
ఈయన సొంతూరు జిల్లాలోని కురబలకోటం మండలం, రేగడ గ్రామం. 2013లో భారత సైన్యంలో చేరారు. సైన్యంలో లాన్స్ నాయక్‌ స్థాయికి ఎదిగిన సాయితేజ... ప్రస్తుతం బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. 
 
బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి కున్నూరుకు రావత్ వెంట సాయితేజ కూడా వచ్చారు. అక్కడ నుంచి వెల్లింగ్టన్‌కు వెళ్లేందుకు హెలికాఫ్టర్ ఎక్కారు. అయితే, కాట్టేరి ప్రాంతంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో సాయితేజ కూడా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబ సభ్యులతో పాటు.. రేగడ గ్రామ ప్రజలు కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. గత సెప్టెంబరు నెలలో వినాయకచవితి పండుగ కోసం సాయితేజ చివరిసారి తన స్వగ్రామానికి వచ్చారు. ఇపుడు శాశ్వత లోకాలకు చేరుకున్నారు. ఈయన పార్థివదేహం గురువారం సొంతూరుకు తరలించే అవకాశముంది.